వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికంగా దెబ్బ తీయడం కోసమే చైనా కరోనా వైరస్‌ని తయారు చేసి వదిలిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికన్ ఇంటిలిజెన్స్ అత్యున్నతాధికారి ఒకరు ప్రపంచం మీద ముఖ్యంగా అమెరికాపై పట్టు సాధించడం కోసం చైనా జీవశాస్త్రపరంగా అత్యున్నత సామార్థ్యాలు కలిగిన సూపర్ సైనికులను సృష్టిస్తోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన నాటి నుంచి డ్రాగన్ దేశం ప్రపంచ దేశాల ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు పెద్ద ప్రమాదంగా మారిందని తెలిపారు. నేషనల్ ఇంటిలిజెన్స్ డైరెక్టర్ రాట్‌క్లిఫ్ వాల్‌స్ట్రీట్ జర్నల్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఓ ఆర్టికల్‌లో చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. పైగా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి కనుక చైనా విషయంలో నిజాయతీగా ఉండాలని సూచించారు. ఇక ఈ కథనంలో రాట్‌క్లిఫ్ చైనా జీవశాస్త్రపరంగా మెరుగైన సామార్థ్యాలు కల సూపర్ సైనికులను సృష్టిస్తోందని.. ఇప్పటికే వీరిపై అనేక ట్రయల్స్ కూడా నిర్వహించారని ఆరోపించారు. ఇక చైనా నేడు అమెరికాకు అతిపెద్ద ప్రమాదంగా మారిందని.. కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచే డ్రాగన్ ప్రపంచ దేశాల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలకు ముప్పుగా మరిందని వెల్లడించారు. (చదవండి: పక్కా ప్లాన్ ప్రకారమే గల్వాన్ దాడి..)
ఇక ఫెడరల్ వార్షిక బడ్జెట్‌లో 85 బిలియన్ డాలర్ల వనరులను చైనాపై దృష్టి సారించడానికే వినియోగిస్తున్నామన్నారు రాట్‌క్లిఫ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాదిలో రాట్‌క్లిఫ్‌ని అత్యున్నత అమెరికా గుఢచార పదవిలో నియమించారు. ఇక రాట్‌క్లిఫ్ మాట్లాడుతూ.. చైనా ఆర్థిక గుఢచర్యం రాబ్, రిప్లికేట్ అండ్ రిప్లేస్(దొంగిలించడం, నకలు తయారి చేయడం, రీప్లేస్ చేయడం)గా సాగుతుందని తెలిపారు. చైనా కంపెనీలు అన్ని ఈ విధానాన్ని అనుసరించి అమెరికా కంపెనీల టెక్నాలజీని దొంగతనం చేసి.. దానికి కాపీ తయారు చేసి.. తిరిగి మార్కెట్‌లోకి తక్కువ ధరకు తీసుకొస్తాయని ఆరోపించారు రాట్‌క్లిఫ్. అంతేకాక చైనా, అమెరికా రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగతనం చేసిందని.. ఆ తర్వాతే జిన్‌పింగ్ చైనా మిలిటరీ ఆధునికీకరణ కార్యక్రమాల్లో దూకుడు పెంచారని ఆరోపించారు. చైనా అధికారులు అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని భావించారని రాట్‌క్లిఫ్ వెల్లడించారు. అయితే అమెరికా చేసిన టెక్నాలజీ దొంగతనం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునింగ్ ఎద్దేవా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చైనా మార్కెట్ విస్తరిస్తుండటంతోనే అమెరికా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని విమర్శించారు. (చదవండి: డోక్లాంలో చైనా గ్రామం.. ఖండించిన భూటాన్)
ఇదే కాక అమెరికా-బీజింగ్ మధ్య గత కొంతకాలంగా కరోనా వైరస్, హాంకాంగ్‌పై చైనా పట్టు, సౌత్ చైనా సీ అంశంలో తలెత్తిన వివాదం, వాణిజ్యం, జిన్‌పింగ్ పాలనలో చోటు చేసుకుంటున్న మానవ హక్కుల హననం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య విబేధాలు తలెత్తాయి. ప్రస్తుతం అమెరికా-చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. రాటక్టిఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు సృష్టించి, ప్రచారం చేయడం అమెరికాకు కొత్త కాదని చైనా విమర్శించింది. ఇక బుధవారం అమెరికన్ ప్రభుత్వం యూఎస్ ఆడిటింగ్ నిబంధనలను పూర్తిగా పాటించని చైనా కంపెనీలను స్టాక్ ఎక్స్‌ఛేంజ్ నుంచి తొలగించే చట్టాన్ని ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment