ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి పది నెలల గడుస్తున్నా రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు చల్లారడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ శత్రు దేశంపై రష్యా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. శక్తివంతమైన క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. రష్యా సేనలను అంతే ధీటుగా ఉక్రెయిన్ బలగాలు తిప్పికొడుతున్నాయి. ఇప్పటికే రష్యా స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ సహా పలు నగరాలను తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంది.
తాజాగా ఓ ఆసుపత్రిపై రష్యా జరిపిన దాడిలో నవజాత శిశువుతోపాటు పలువురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ జపోరిజ్జియా ప్రాంతంలోని విల్నియన్స్క్‌లోని ఆసుపత్రి భవనంపై బుధవారం రష్యన్ రాకెట్లు దూసుకొచ్చాయని ఉక్రేనియన్ అత్యవసర సేవల విభాగం అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆసుపత్రి భవనంలోని రెండు అంతస్తుల్లో ఉన్న ప్రసూతి వార్డు ధ్వంసమైందని పేర్కొన్నారు. వైద్య పరికరాలు దెబ్బతిన్నాయన్నారు.
శిథిలాల కింద నవజాత శిశువుతోపాటు ఓ మహిళ, డాక్టర్ చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. మహిళ, డాక్టర్‌ను రక్షించగా.. దురదృష్టవశాత్తు శిశువుని కాపాడుకోలేకపోయినట్లు చెప్పారు. ధ్వంసమైన ప్రసూతి వార్డు శిథిలాల కింద ఓ వ్యక్తి చిక్కుకొని ఉండగా అతడిని ఎమర్జెన్సీ అధికారులు కాపాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు రష్యా చర్యపై ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. గత తొమ్మిది నెలలుగా సాధించలేకపోయిన దానిని.. బెదిరింపులు, దాడులు, హత్యలతో దక్కించుకోవాలని శత్రు దేశం మరోసారి నిర్ణయించుకుందని ట్విటర్‌లో ఆరోపించారు.
చదవండి: వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
Russian forces shelled a maternity ward in Zaporizhzhia overnight, with reports that a newborn baby was killed #Ukraine https://t.co/alqIdm3dWs pic.twitter.com/xSRq8sFZzD
— Michael A. Horowitz (@michaelh992) November 23, 2022
అదే బుధవారం ఈశాన్య ఖార్కివ్ ప్రాంతంలో తొమ్మిది అంతస్తుల భవనంపై జరిపిన దాడిలో ఇద్దరు వ్యక్తులు(ఓ మహిళ, వ్యక్తి) మరణించారని స్థానిక గవర్నర్ ఒలేగ్ సైనెగుబోవ్ తెలిపారు. అయితే రష్యా సేనలు ఉక్రేయిన్‌లోని ఆసుపత్రులపై దాడి చేయడం ఇదే తొలిసారి కాదు. రష్యా ఆక్రమించుకున్న మరియుపోల్‌తో సహా అనేక ప్రాంతాల్లోని హాస్పిటల్స్‌పై దాడులు చేసింది. రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ ఆరోగ్య కేంద్రాలపై 700 కంటే ఎక్కువ దాడులు చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పేర్కొంది. అంతేగాక గత మార్చిలో మరియూలోని ఆసుపత్రిపై జరిపిన రష్యా సైనిక చర్యలో ఓ చిన్నారితో సహా ముగ్గురు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment