ఉక్రెయిన్‌లోని బుషీవ్ గ్రామంలో రష్యా దాడిలో నేలమట్టమైన సాంస్కృతిక కేంద్రం
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా అణు చెలగాటమాడుతోంది. వారం కింద చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న వైనాన్ని మర్చిపోకముందే మరో అణు ప్లాంట్‌పై దాడికి తెగబడింది. ఆగ్నేయ ప్రాంతంలో ఎనర్‌హోడర్ నగరంపై గురువారం అర్ధరాత్రి దాటాక రష్యా దళాలు యుద్ధ ట్యాంకులతో భారీ దాడులకు దిగాయి. దాన్ని ఆక్రమించే ప్రయత్నంలో యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం వద్దా బాంబుల వర్షం కురిపించినట్టు సమాచారం.
దాంతో వాడుకలో లేని ఒకటో నంబర్‌రియాక్టర్‌కు మంటలంటుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి వాటిని ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలకు కాల్పులే కారణమా అన్నది తెలియరాలేదు. కొద్దిపాటి ప్రతిఘటన అనంతరం విద్యుత్కేంద్రాన్ని రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. దాడిలో ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు మరణించారని, అగ్నిప్రమాదంలో ఇద్దరు స్బిబంది గాయపడ్డారని సమాచారం.
కాల్పుల వల్లే రియాక్టర్‌కు మంటలంటుకున్నాయని ఉక్రెయిన్ చెప్పగా, దాడుల్లో ప్లాంటులోని శిక్షణ కేంద్రం దెబ్బ తిన్నది తప్పిస్తే అందులోని ఆరు రియాక్టర్లకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చీఫ్ రాఫెల్ గ్రోసీ అన్నారు. రష్యా దుశ్చర్య యూరప్ వెన్నులో చలి పుట్టించింది. ప్రపంచ దేశాలన్నింటినీ షాక్‌కు గురిచేసింది. చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం పేలుడు తాలూకు ఉత్పాతాన్ని తలచుకుని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాది మతిమాలిన చర్య అంటూ యూరప్ దేశాలన్నీ దుమ్మెత్తిపోశాయి.
సాధారణంగానే అణు ధార్మికత
అణు విద్యుత్కేంద్రంపై దాడికి సంబంధించిన ఫుటేజీని ఉక్రెయిణ్ విడుదల చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచే రష్యా సైనిక వాహనాలు భారీ సంఖ్యలో దానివైపు దూసుకెళ్లడం అందులో స్పష్టంగా కన్పించింది. తర్వాత కాసేపటికే విద్యుత్కేంద్రం పరసరాల్లోని భవనాలన్నీ బాంబుల దాడితో దద్దరిల్లిపోయాయి. అయితే ఆ తర్వాత కన్ను పొడుచుకున్నా కానరానంత పొగ పరసరాలన్నింటినీ కమ్మేసింది. కాసేపటికే రియాక్టర్‌కు మంటలంటుకున్నాయి. రియాక్టర్లు గనక పేలితే సర్వం నాశమయ్యేదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మండిపడ్డారు.
రష్యా దూకుడును అడ్డుకోవడానికి ఉక్రెయిన్‌ను తక్షణం నో ఫ్లై జోన్‌గా ప్రకటించాల్సిందిగా పశ్చిమ దేశాలను కోరారు. అయితే నాటో అందుకు నిరాకరించింది. ‘‘జెలెన్‌స్కీ ఆందోళనను మేం అర్థం చేసుకోగలం. కానీ నో ఫ్లై జోన్ ప్రకటన చేస్తే ఉక్రెయిన్ గగనతలాన్ని కాపాడేందుకు నాటో ఫైటర్ జెట్లు రంగంలోకి దిగి రష్యా విమానాలను కూల్చాల్సి ఉంటుంది. అది యూరప్‌లో పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తుంది’’ అని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు.
అమెరికా, ఇంగ్లండ్, ఐర్లండ్, నార్వే, అల్బేనియా విజ్ఞప్తి మేరకు అణు కేంద్రంపై దాడిని చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. తమను అప్రతిష్టపాలు చేసేందుకు అణు కేంద్రం వద్ద ఉక్రెయినే అగ్నిప్రమాదానికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. రియాక్టర్ వద్ద, పరిసరాల్లో రేడియో ధార్మికత స్థాయిలు పెరిగినట్టు ఉక్రెయిన్ చెప్పగా, సాధారణంగానే నమోదైనట్టు ఐఏఈఏ ప్రకటించింది. ఉక్రెయిన్ విద్యుత్ అవసరాల్లో 25 శాతాన్ని తీరుస్తున్న జపోరిజియా ప్లాంటులోని ఆరు అణు రియాక్టర్లలో ప్రస్తుతం ఒక్కటే 60 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది.
దాడులు మరింత ముమ్మరం
రాజధాని కీవ్, ఖర్కీవ్ నగరాలు రష్యా దాడులతో అట్టుడుకుతున్నాయి. శుక్రవారమంతా ఎడతెరిపి లేని బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. కీవ్‌లో అయితే కనీసం ప్రతి 10 నిమిషాలకు ఒక పేలుడు జరిగిందని సమాచారం. రాజధానిని ఆక్రమించేందుకు 15 వేలకు పైగా అదనపు బలగాలు తాజాగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నగరానికి వాయవ్యంగా క్షిపణి దాడులు, యుద్ధ ట్యాంకుల బీభత్సం తీవ్రంగా ఉందని ఉక్రెయిన్ చెబుతోంది. ఖర్కీవ్‌తో పాటు ఒఖ్‌తిర్కాలపై రష్యా దళాలు భారీగా దాడులకు దిగుతున్నాయి. రేవు పట్టణం మారిపోల్‌లోనూ, పలు ఇతర నగరాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.
తిప్పికొడుతున్న ఉక్రెయిన్
చెర్నిహివ్, మైకోలెయివ్ వంటి పలు నగరాల్లో రష్యా దాడిని ఉక్రెయిన్ సైన్యాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. అలాగే రేవు పట్టణం ఒడెసాలోనూ రష్యా సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. నౌకలపై నుంచి నగరంపైకి రష్యా దాడులకు దిగుతోంది. రష్యా సైనికులకు ఆహారం, నిత్యావసరాలు అందకుండా చేస్తూ వారిని నీరసింపజేసే వ్యూహాన్ని ఉక్రెయిన్ ఎక్కడికక్కడ అమలు చేస్తోంది.
ఉక్రెయిన్ వలసలు 12 లక్షలు: ఐరాస
జెనీవా: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాక శుక్రవారం నాటికి ఆ దేశం నుంచి 12 లక్షల మంది వలసబాట పట్టారని ఐక్యరాజ్య సమితి వలసల విభాగం తెలిపింది. గురువారం ఒక్కరోజే 1.65 లక్షల మంది దేశం వీడారని తెలిపింది. సుమారు 6.5 లక్షల మంది పొరుగునున్న పోలండ్‌లో, 1.45 లక్షల మంది హంగరీ, లక్ష మంది మాల్దోవా, 90వేల మంది స్లొవేకియాలో తలదాచుకున్నట్లు వివరించింది. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులేనని పేర్కొంది.
జపాన్ రక్షణ సామగ్రి
టోక్యో: ఉక్రెయిన్‌కు సాయంగా రక్షణ సామగ్రి పంపుతూ జపాన్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు రక్షణ సామగ్రిని అందజేయొద్దన్న స్వీయ నియమాన్ని పక్కన పెట్టి మరీ బుల్లెట్‌ఫ్రూప్ జాకెట్లు, హెల్మెట్లు, టెంట్లు, జనరేటర్లు, ఆహారం, దుస్తులు, మందులు వంటివి పంపింది.
Comments
Please login to add a commentAdd a comment