బెర్లిన్: కరోనా నిరోధక వ్యాక్సిన్ తమ ప్రజలకే ముందుగా అందించాలన్న దేశాల ఆలోచనా విధానం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్‌ను ప్రభావంతంగా ఉపయోగించుకుంటేనే, మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లోని ప్రజలందరికీ టీకా అందించడం కంటే కూడా, అన్ని దేశాల్లోని కొంతమంది ప్రజలకు వాక్సినేషన్ చేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. కాగా ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. రష్యాలో స్పూత్నిక్- వీ పేరిట టీకాను విడుదల చేయగా, క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్న క్రమంలో మరికొన్ని కంపెనీలు, త్వరలోనే వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.(చదవండి: నన్ను గెలిపిస్తే అందరికీ ఫ్రీగా వాక్సిన్)
ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాలు భారీ స్థాయిలో వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసి, ప్రజలకు అందించే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే పేద దేశాల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ విషయం గురించి టెడ్రోస్ ఆదివారం నాటి సదస్సులో మాట్లాడుతూ.. ‘‘ తమ ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సిన్‌ను దక్కించుకునేందుకు దేశాలు పోటీపడటం సహజం. అయితే ఇప్పుడు వ్యాక్సిన్‌ను ఎంత ప్రభావంతంగా ఉపయోగించుకోగలమన్న అంశం మీదే కోవిడ్-19 వ్యాప్తి ఆధారపడి ఉంటుంది.
వ్యాక్సిన్ నేషనలిజం వల్ల మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలే తప్ప, దానిని నియంత్రించే అవకాశం ఉండదు. యూరప్ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇలాంటి తరుణంలో, వ్యాక్సిన్‌ను కొన్ని దేశాలకే పరిమితం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ప్రభావంతమైన వ్యాక్సిన్ విడుదలైతే, అన్ని దేశాల్లోనూ అది వినియోగంలోకి వచ్చినపుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. (వ్యాక్సిన్ : వారు 2022 వరకు ఆగాల్సిందే!)
అత్యంత తీవ్రమైన సంక్షోభం ఇది: ఐరాస చీఫ్
ఇక ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ.. ‘‘సమకాలీన పరిస్థితుల్లో ఇదే అత్యంత తీవ్రమైన సంక్షోభం. ఇప్పుడు ప్రపంచమంతా అడుగడుగునా కలిసి నుడుస్తూ, సుహృద్భావంతో మెలగాల్సిన ఆవశ్యకత ఉంది. వ్యాక్సిన్లు, కరోనా టెస్టులు, చికిత్సా విధానాలే ఇప్పుడు మన జీవితాన్ని కాపాడే మార్గాలు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి’’అని పేర్కొన్నారు. కాగా శనివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 4,65,319 కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లండించింది. వీటిలో సగం కంటే ఎక్కువ కేసులు యూరప్ దేశాల్లో వెలుగుచూసినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment