కనీవినీ ఎరుగని ఘోరం జరుగుతుంది. పత్రికల్లో పతాక శీర్షికవుతుంది. చానెళ్లలో ప్రధాన చర్చ నీయాంశంగా మారుతుంది. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. కారకులను ఉరికంబం ఎక్కించాలంటూ జనం డిమాండ్ చేస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్‌కౌంటర్ చేయాలని గొంతెత్తుతారు. తీరా కాలం గడిచాక, న్యాయస్థానాల్లో విచారణలు వాయిదాల్లో సాగాక నిందితులు నిర్దోషులుగా విడుదలవుతారు. అన్ని కేసుల్లోనూ కాకపోవచ్చుగానీ, కొన్నింటి విషయంలో ఇలాగే జరుగుతోంది.
బాధిత కుటుంబాలకు న్యాయం దక్కలేదని ఆక్రోశించాలో, అమాయకులకు విముక్తి లభించిందని భావించాలో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతోంది. మరి దోషులెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. సరిగ్గా పదిహేడేళ్ల క్రితం పెనుసంచలనం సృష్టించిన ‘నిఠారీ హత్యల’ కేసుల్లో నిందితులుగా భావించిన సురేందర్ కోలీ, మోనిందర్ సింగ్ పంధేర్‌లు తాజాగా అలహాబాద్ హైకోర్టు తీర్పుతో నిర్దోషులుగా బయటపడటం బహుశా ఎవరూ ఊహించని ముగింపు. ఎందుకంటే 2005–06 మధ్య వారిద్దరూ చేశారని చెప్పిన నేరాల జాబితా చాలా పెద్దది.
వారి చేతుల్లో ఏకంగా 18 మంది బాలికలు, మహిళలు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. ఒంటరిగా కనబడిన నిరుపేద బాలికలకూ, మహిళలకూ మాయమాటలు చెప్పి బంగ్లాలోకి తీసుకెళ్లటం, వారిని హతమార్చటం నేరగాళ్లు అనుసరించిన విధానం. హత్యల తర్వాత మృతదేహాలపై కోలీ, పంధేర్‌లు లైంగికదాడి జరిపే వారనీ, నరమాంస భక్షణ చేసేవారనీ వచ్చిన కథనాలు వెన్నులో వణుకు పుట్టించాయి. మృత దేహాలపై లైంగిక దాడి తర్వాత శరీర భాగాలను ఇంటి వెనకున్న కిటికీ నుంచి విసిరేసేవారని కూడా ఆ కథనాల సారాంశం.
ఎప్పటికప్పుడు వీరందరి అదృశ్యంపైనా ఫిర్యాదులొచ్చినా పోలీసులు నిర్లక్ష్యం వహించటంవల్లే ఇన్ని హత్యలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. తీరా ఇన్నేళ్లు గడిచాక పోలీసులు సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయారనీ, వారి దర్యాప్తు ఆద్యంతం అస్తవ్యస్థంగా సాగిందనీ హైకోర్టు తేల్చింది. వీధిలో ఆడుకుంటున్న పిల్లలకు మురికి కాల్వలో పుర్రె భాగం దొరకటంతో ఈ కేసుల డొంక కదిలింది. ఆ తర్వాత 8 మంది పిల్లల ఎముకలు ఇంటి వెనుక దొరికాయి.
నిందితులపై 2009లో బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్, సైకలాజికల్ అసెస్‌మెంట్స్ వంటి శాస్త్రీయ పరీక్షలు చేశారని వార్తలొచ్చాయి. ‘హఠాత్తుగా నాలో దయ్యం నిద్ర లేచేది. ఎవరినో ఒకరిని మట్టుబెట్టాలన్న వాంఛ పుట్టుకొచ్చేది’ అని కోలీ చెప్పినట్టు కూడా మీడియా కథనాలు తెలిపాయి. నిందితులిద్దరిపైనా 19 కేసులు నమోదుకాగా, వీటిని విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 12 కేసుల్లో కోలీని దోషిగా తేల్చి మరణశిక్ష విధించగా, రెండు కేసుల్లో పంధేర్ దోషిగా తేలాడు.
అతనికి కూడా మరణశిక్ష పడింది. దోషులు అప్పీల్ చేసుకోగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఒక కేసులో మినహా అన్నింటి లోనూ కోలీ నిర్దోషిగా బయటపడ్డాడు. పంధేర్‌కు అన్ని కేసుల నుంచీ విముక్తి లభించింది. వీరిద్దరి పైనా బలమైన సాక్ష్యాధారాలూ లేవని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నోయిడా సెక్టార్‌లోని నిఠారి అప్పట్లో ఒక చిన్న గ్రామం. ఇప్పుడు పట్టణంగా మారింది. మన నేర న్యాయవ్యవస్థ మాత్రం ఎప్పట్లాగే లోపభూయిష్టంగా ఉంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు దాన్నే నిర్ధారించింది.
మీడియాలో ప్రముఖంగా ప్రచారంలోకొచ్చి, ఆందోళనలు మిన్నంటే కేసుల్లో పోలీసు లపై వాటి ప్రభావం, ఒత్తిళ్లు అధికంగా వుంటాయనటంలో సందేహం లేదు.వాటిని సాకుగా చూపి ఆదరాబాదరాగా ఎవరో ఒకరిని నిందితులుగా తేల్చాలనుకోవటం సరికాదు. సాక్ష్యాధారాల సేక రణలో కూడా పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయారనీ, నిందితులపై థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించి తేల్చటానికే ఉత్సాహం ప్రదర్శించారనీ హైకోర్టు తప్పుబట్టిందంటే దర్యాప్తు ఎలా అఘోరించిందో అర్థం చేసుకోవచ్చు.
చాన్నాళ్లక్రితం కేంద్ర ప్రభుత్వ కమిటీ మనుషుల అదృశ్యాల వెనక శరీర అవయవాల వ్యాపారం సాగించే సంఘటిత ముఠాల హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. నిఠారి హత్యల విషయంలో ఆ కోణంలో దర్యాప్తు సాగలేదు. థర్డ్ డిగ్రీ విధానాలను ఉపయోగించటం ద్వారా పోలీసులు కేసు తేల్చేశారన్న అభిప్రాయం జనంలో కలిగించవచ్చుగానీ, న్యాయస్థానాల్లో విచారణ సమయానికి ఇవన్నీ మటుమాయమవుతాయి. సంశయాతీతంగా సాక్ష్యా ధారాలుండకపోతే, మమ్మల్ని కొట్టి ఒప్పించారని నిందితులు చెబితే చివరికి కేసు వీగి పోతుంది.
కేవలం ఒక వ్యక్తి లేదా ఇద్దరు ఇంతమందిని హతమార్చారనీ, మరెవరి ప్రమేయమూ ఇందులో లేదనీ నిర్ధారించాలంటే అందుకు దీటైన సాక్ష్యాధారాలుండాలి. అవి శాస్త్రీయంగా సేకరించాలి. ఎక్కడ అశ్రద్ధ చేసినా, ఏ చిన్న లోపం చోటుచేసుకున్నా మొత్తం కుప్పకూలిపోతుంది. దానికి తోడు ప్రతీకారంతో రగిలిపోతూ తక్షణ న్యాయం కావాలని రోడ్డెక్కే ధోరణులు మొత్తం దర్యాప్తును అస్తవ్యస్థం చేస్తున్నాయి. జనాన్ని సంతృప్తిపరచటం కోసం దొరికినవారిని నిందితులుగా తేల్చి పోలీసులు చేతులు దులుపుకొంటున్నారు. సుప్రీంకోర్టులో ఎటూ సీబీఐ అప్పీల్ చేస్తుంది. అక్కడే మవుతుందన్నది చూడాల్సివుంది. అత్యాధునిక ప్రమాణాలతో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం.
అంతరిక్షంలో ఘనవిజయాలు నమోదు చేస్తున్నాం. కానీ పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దటంలో, దానికి వృత్తిగత నైపుణ్యాలను అలవాటు చేయటంలో విఫలమవుతున్నాం. క్రిమినల్ కేసుల్లో సత్వర దర్యాప్తు, పకడ్బందీ సాక్ష్యాధారాల సేకరణ ప్రాణప్రదం. వాటిని విస్మరిస్తే కేసులు కుప్ప కూలు తాయి. నేరగాళ్లు తప్పించుకుంటారు. నిఠారి నేర్పుతున్న గుణపాఠాలివే.
Comments
Please login to add a commentAdd a comment