ఆస్ట్రేలియా అధికారులు గత రెండు వారాల్లో కొన్ని లక్షల తేనెటీగలను చంపేశారు. వాటిని పెంచే కాలనీలను మూసివేశారు. ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించి ఒక్క తేనెటీగను కూడా బయటకు పోకుండా, బయటి నుంచి ఇతర తేనెటీగలు లోనికి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ఇంత కఠినమైన చర్యలు తీసుకోవడాని ఎంతో బలమైన కారణమే ఉంది. వరోవా మైట్ అనే పరాన్నజీవి తేనెటీగలపై దాడి చేస్తోంది. ఈ పురుగులకు తేనెటీగలే ఆహారం.
అంతేకాదు వరోవామైట్ దాడి చేసిన తేనెటీగలకు ప్లేగువ్యాధి వాపిస్తుంది. ఇది ఒకదాని నుంచి మరోదానికి సంక్రమిస్తుంది. ఫలితంగా ఆస్ట్రేలియాలో తేనెటీగలు మొత్తం ఈ వ్యాధి బారినపడి చనిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రూ.వందల కోట్ల వాణిజ్యం జరిగే ఆస్ట్రేలియా తేనె పరిశ్రమ కుదేలవుతుంది. భారీ నష‍్టం వాటిల్లుతుంది. అందుకే ప్రభుత్వం వరోవా మైట్‌ను నివారించేందుకు అది సంచరించిన తేనెటీగల కాలనీలను అంతం చేస్తోంది. దీనివల్ల ఇతర ప్రాంతాలకు ప్రాణాంతక వరోవామైట్ వ్యాపించే ముప్పు తప్పుతుంది.
వరోవామైట్ అనే పరుగు ఎరుపు గోదుమ రంగులో నువ్వు గింజ పరిమాణంలో ఉంటుంది. ఈ పరాన్నజీవులకు తేనెటీగలే ఆహారం, ఆధారం. సిడ్నీ సమీపంలోని ఓడరేవు వద్ద గతవారం వీటిని గుర్తించారు. ఈ మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఆ ప్రాంతంలోని తేనెటీగల కాలనీల్లో లాక్‌డౌన్ విధించింది.
వరోవా వ్యాప్తిని విజయవంతంగా నియంత్రించిన అతికొద్ది దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. 2016, 2019, 2020 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా వీటి ముప్పును అదిగమించింది. అయితే ఈసారి మళ్లీ వచ్చిన వరోవా పురుగులు ఇక్కడే తిష్ట వేసేలా ఉన్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 10 చోట్ల దీని ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. దబ్బో నగరానికి 378కిలోమీటర్ల దూరంలోనూ వరోవా ప్రభావం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వరోవా వ్యాపించిన తేనెతెట్టెలను గుర్తించడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. దీన్ని కట్టడి చేయలేకపోతే రూ. వందల కోట్ల నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో మొత్తం తేనెటీగల పరిశ్రమకే ముప్పు వస్తుందనే కారణంతో తేనెటీగలను చంపేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment