ఒట్టావా: కెనడా-భారత్ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. ఈ పరిణామం తర్వాత ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. ఇరు దేశాలు తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. జస్టిన్ ట్రూడో తన రాజకీయ మనుగడ కోసమే ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇంతకీ కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత పెరిగిందనే చర్చ ప్రస్తుతం మొదలైంది.
కెనడాలో సిక్కు జనాభా..
2021 జనాభా లెక్కల ప్రకారం కెనడాలో 3.70 కోట్ల జనాభా ఉంది. ఇందులో 16 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇది కెనడా జనాభాలో దాదాపు 4 శాతం. కెనడా భారతీయ జనాభాలో సిక్కులు 7,70,000 మంది అక్కడ నివసిస్తున్నారు. గత 20 ఏళ్ల నుంచి కెనడాలో సిక్కు జనాభా ఒక్కసారిగా రెండింతలు పెరిగిపోయింది. ఉన్నత విద్య, ఉద్యోగాల పేర పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు.
కెనడాపై సిక్కు ప్రభావం..
కెనడాలో అత్యంత ప్రభావశీలంగా అభివృద్ధి చెందుతున్న జాబితాలో సిక్కులు ఉన్నారు. క్రిస్టియన్స్, ముస్లిం, హిందూల తర్వాత సిక్కులు నాలుగో పెద్ద జనసంఖ్య కలిగినవారిగా అవతరించారు. ప్రధానంగా ఒంటారియో, బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. పంజాబీ భాష కెనడాలో మూడో పాపులర్ భాషగా ప్రాధాన్యత సంతరించుకుంది.
నిర్మాణ రంగం, రవాణా, బ్యాంకింగ్ రంగాలలో సిక్కులు కెనడా ఆర్థికాభివద్ధిలో భారీ సహకారం అందిస్తున్నారు. చాలా మంది సిక్కులు హోటల్, రెస్టారెంట్, గ్యాస్ స్టేషన్‌ల వంటి వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 4.15 లక్షల సిక్కులు శాశ్వత నివాసాన్ని పొందారు. 1980లో కేవలం 35000 మంది మాత్రమే శాశ్వత నివాసాన్ని కలిగి ఉండగా.. ఆ సంఖ్య ఇటీవల కాలంలో అమాంతం పెరిగిపోయింది.
రాజకీయంగా..
జస్టిన్ ట్రూడో 2015 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిక్కులకు మరింత ప్రాధాన్యత పెరిగిపోయింది. సిక్కు వర్గం నుంచే కేవలం నలుగురు మంత్రులను నియమించారు. కేంద్ర స్థాయిలో అత్యధిక వాటా ఈ వర్గానికి కేటాయించారు.
సిక్కులు కెనడాలోఇంతటి ప్రధాన్యత కలిగిన వర్గంగా అభివృద్ధి చెందడానికి వారి గురద్వారాలే కారణమని నిపుణులు చెబుతారు. సిక్కు ఫండ్స్‌ను గ్రాంట్‌ల రూపంలో వసూలు చేసి ఎన్నికల కోసం వాటిని ఖర్చు చేస్తున్నారు. కెనడాలోని మొత్తం 388 ఎంపీల్లో 18 మంది ఎంపీలు సిక్కు వర్గానికి చెందినవారు ఉన్నారు. అందులో ఎనిమిది సీట్లు పూర్తిగా సిక్కుల ఆధీనంగా ఉంటాయి. మరో 15 సీట్లలో తమ ప్రభావం చూపుతున్నారు. ఈ కారణంగానే ఏ రాజకీయ పార్టీలు సిక్కులకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..?
Comments
Please login to add a commentAdd a comment