కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే సీఈవోల వార్షిక వేతనం రూ. కోట్లలో ఉండటం సహజమే. దిగ్గజ సంస్థల్లో పనిచేసే కొందరైతే రూ. వందల కోట్లు కూడా ఆర్జిస్తుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంఎన్‌సీల్లో పనిచేసే సీఈవోల్లో చాలా మంది కేవలం ఒక డాలర్ వేతనాన్నే ఎందుకు తీసుకుంటున్నారు? తమ తెలివితేటలతో ఆయా సంస్థలను అగ్రపథాన నడిపిస్తున్నప్పటికీ వారు ఇలా నామమాత్ర జీతాన్ని అందుకోవడానికి కారణమేంటి? ఇది నిజంగా వారు చేస్తున్న త్యాగమా? లేక దీని వెనక ఏమైనా గిమ్మిక్కు దాగి ఉందా?
చరిత్రను పరిశీలిస్తే...
► బడా సంస్థల సీఈవోలు కేవలం ఒక డాలర్ వేతనాన్ని తీసుకొనే సంప్రదాయం రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే మొదలైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ అప్పట్లో చాలా మంది ఈ నిర్ణయం తీసుకున్నారు.
► చాలా మంది ఎగ్జిక్యూటివ్‌లు అమెరికా ప్రభుత్వానికి ఉచితంగా తమ సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. అయితే జీతం ఇవ్వకుండా పనిచేయించుకోవడం చట్టప్రకారం నిషిద్ధం కావడంతో అలా ముందుకొచ్చిన వారికి ఒక డాలర్ వేతనాన్ని ఆఫర్ చేశారు.
► అలా నామమాత్ర జీతం అందుకున్న వారు ‘డాలర్–ఎ–ఇయర్–మెన్’గా పేరుగాంచారు.
చదవండి: పంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే!
త్యాగధనులు అనిపించుకోవడానికి...
► అమెరికాలోని టాప్–3 ఆటోమొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన క్రిస్లర్ 1980లో కుప్పకూలే స్థితికి చేరుకున్నప్పుడు అప్పటి సీఈవో లీ ఇయాకోకా ప్రభుత్వం నుంచి 1.5 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ సాధించి సంస్థను గట్టెక్కించారు. అదే సమయంలో సంస్థలోని కార్మికులు, డీలర్లు, సరఫరాదారులు వారికి రావాల్సిన బకాయిలను స్వచ్ఛందంగా వదులుకొనేలా ఒప్పించారు.
► సంస్థను తిరిగి గాడినపెట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చాటిచెప్పేందుకు తన వేతనాన్ని ఒక డాలర్‌కు తగ్గించుకున్నారు.
వాటాదారులకు సంఘీభావం తెలిపేలా...
►ఏడాదికి కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకుంటున్నట్లు చూపడం ఓ రకంగా ప్రతీకాత్మకమే.. సంస్థ గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నట్లు చెప్పడానికి సీఈవోలు ఇలా వ్యవహరిస్తుంటారు.
► ఏటా కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకొనే సీఈవోలు నిజానికి సంస్థ స్టాక్‌లు, ఆప్షన్లు, బోనస్‌లను పనితీరు ఆధారిత పరిహారం కింద అందుకుంటుంటారు.
చదవండి: సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే!
బయటకు కనిపించేంత నిస్వార్థపరులేం కాదు..!
► పనితీరు ఆధారిత చెల్లింపుల కింద సీఈవోలు పొందే భారీ మొత్తాలపై చాలా వరకు తక్కువ పన్ను రేటే వర్తిస్తుంది.
► సీఈవోలకు చేసే ఈ తరహా చెల్లింపులను సంస్థ పన్ను ఆదాయంలోంచి కోతపెట్టేందుకు 1993లో అమెరికా చేసిన చట్టం అనుమతిస్తుంది. అంటే ఓ రకంగా చూస్తే సీఈవోలు పొందే భారీ మొత్తాలకు పన్ను చెల్లింపుదారులు సబ్సిడీ ఇస్తున్నట్లే లెక్క.
► కేవలం ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 2018లో ఫెడరల్ ఆదాయ పన్నుల కింద దమ్మిడీ కూడా చెల్లించలేదట!
ఒక అధ్యయనంలో తేలింది ఏమిటంటే...
► 2011లో 50 మంది సీఈవో లపై చేపట్టిన ఓ సర్వే గణాంకాలను (2019 ద్రవ్యోల్బణ విలువలకు సరిదిద్దాక) పరిశీలిస్తే ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే సీఈవోలు సగటున జీతం కింద 6.10 లక్షల డాలర్లను వదలుకుంటున్నట్లు వెల్లడైంది. కానీ అదే సమయంలో వారు బయటకు ఎవరికీ పెద్దగా కనపించని ఈక్విటీ ఆధారిత పరిహారం కింద 20 లక్షల డాలర్ల మేర లబ్ధి పొందుతున్నట్లు తేలింది!
చదవండి: పిండి, కోడి గుడ్లు.. ఇలాంటి తమాషా యుద్ధం ఎప్పుడైనా చూశారా?
100 రెట్లకుపైగా...
► 2019లో జరిగిన మరో అధ్యయనం ప్రకారం... అమెరికాలోని 500 బడా కంపెనీల సీఈవోల్లో 80 శాతం మంది తమ సంస్థల్లో పనిచేసే ఓ మధ్యశ్రేణి ఉద్యోగి వేతనానికి 100 రెట్లకుపైగా ఆర్జిస్తున్నారు.
అసమానతల దృష్టి మళ్లించేందుకే...
► గత కొన్ని దశాబ్దాలుగా సీఈవో–ఉద్యోగి మధ్య వేతన వ్యత్యాసం ఎన్నో రెట్లు పెరిగిపోయింది.
►ఆర్థిక అసమానతలపై ఉద్యోగ సంఘాల దృష్టి మళ్లించేందుకు సీఈవోల నామమాత్ర వేతనం ఒక మార్గంగా మారినట్లు ఓ పరిశోధన గుర్తించింది.
►బాగా శక్తిమంతమైన సీఈవోలు ఒక డాలర్ జీతం విధానాన్నే ఎంచుకుంటారని, తద్వారా సంస్థ నుంచి వారు పొందే మొత్తం పరిహారంపై ఎక్కడా గగ్గోలు చెలరేగకుండా చూసుకుంటారని ఆ పరిశోధనలో వెల్లడైంది.
చదవండి: గాల్లో తాడుపై నడిచాడు.. ఇది మామూలు రికార్డు కాదు!
తిరగబడ్డ తెలివి...
► ఒక డాలర్ వార్షిక వేతనంగా పొందే సీఈవోలు ప్రాతినిధ్యం వహించే సంస్థలు తమ ఆస్తులు, రాబడులపై నెలకు ఆర్జించే సొమ్ము... మార్కెట్ రేటు వేతనాలు పొందే సీఈవోలు ఉన్న కంపెనీలతో పోలిస్తే ఒక శాతం తక్కువని 2014లో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది.
► ఒక డాలర్ వేతనం పొందే సీఈవోల అతివిశ్వాసం లేదా తమ కొలువుకు ఢోకా ఉండదన్న వైఖరి వల్ల ఆయా సంస్థల్లో ఇలా ‘పనితీరు తగ్గుదల’కనిపించినట్లు సర్వే వివరించింది.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment