ట్రంప్ ఎంత జీతం తీసుకుంటాడో తెలుసా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన జీతంపై ఆశ్చర్యకర ప్రకటన చేశారు. ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాదికి ఒక్క డాలర్ మాత్రమే జీతంగా తీసుకుంటానని, తనకు నాలుగు లక్షల డాలర్లు వద్దని చెప్పారు. అంతేకాదు, పర్యటనల పేరిట వృధా ఖర్చు చేయకుండా వాటిని నిలువరిస్తానని తెలిపారు. త్వరలో అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో జీతం గురించి ఓ మీడియా ప్రశ్నించగా 'లేదు.. నేను జీతం తీసుకోవాలనుకోవడం లేదు' అని స్పష్టం చేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో తాను సాలరీ తీసుకోనంటూ ఓ వీడియో ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించే ఆయన మరోసారి వివరణ ఇచ్చారు. దేశంలో చాలా పనిచేయాల్సి ఉందని, ప్రజల కోసం తాను అదంతా చేస్తానని ట్రంప్ చెప్పారు. ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, పన్నుల అంశాన్ని పరిశీలించాల్సి ఉందని, ఇలా ఎన్నో పెద్ద పెద్ద పనులు ఉన్నందున తాను వెకేషన్స్ లాంటివి పెద్దగా పెట్టుకోవాలనుకోవడం లేదని ట్రంప్ చెప్పారు.