ప్రియుడితో గొడవ.. ఎనిమిదో అంతస్థు నుంచి దూకేసింది | Woman Jumps From 8th Floor Due To Ghost Gun Brawl With BF | Sakshi
Sakshi News home page

ప్రియుడితో గొడవ.. ప్రాణ భయంతో ఎనిమిదో అంతస్తు నుంచి దూకింది!

Published Sat, Apr 23 2022 2:39 PM | Last Updated on Sat, Apr 23 2022 2:43 PM

Woman Jumps From 8th Floor Due To Ghost Gun Brawl With BF - Sakshi

ప్రాణ భయంతో ఎనిమిదవ అంతస్తు నుంచి దూకింది ఓ మహిళ. తుపాకీతో ప్రియుడే చంపే ప్రయత్నం చేయగా.. తప్పించుకునే క్రమంలో ఆమె అలా దూకేసింది. అయితే  తీవ్ర గాయాలతో బయటపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

అమెరికా వాషింగ్టన్‌ డీసీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్త్‌వెస్ట్‌ వాషింగ్టన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జంటకు ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఆ రాత్రి ఇద్దరూ గొడవపడి.. పరిస్థితి హత్య చేసే దాకా వెళ్లిందట. కాళ్లు, చేతులు కట్టేసి మరీ ఆమెను తుపాకీతో కాల్చే యత్నం చేశాడు దుండగుడు. అయితే.. చేతులు విడిపించుకున్న ఆమె కిటికీ గుండా ఎనిమిదవ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. 

మెట్రోపాలిటిటన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వివరాల ప్రకారం.. నిందితుడిని కైలీ జమల్‌ పామర్‌గా గుర్తించి.. అరెస్ట్‌ చేశారు. దాడి, హత్యాయత్నం కింద అతనిపై కేసు నమోదు చేశారు. 

ఘోస్ట్‌ గన్‌ చట్టం తెచ్చినా.. 
అమెరికాలో అక్రమంగా తుపాకులు కలిగి ఉండడం, ఇంట్లో తయారు చేయడం కఠిన నేరం. ఇలాంటి తుపాకుల్ని ఘోస్ట్‌ గన్‌లు అంటారు. అంటే లైసెన్స్‌ లేనివన్నమాట. దేశంలో కాల్పుల ఘటనలు పేట్రేగి పోతుండడంతో బైడెన్‌ ప్రభుత్వం ఇలాంటి వాటిని నిషేధిస్తూ ఈమధ్యే ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. చట్టం తెచ్చిన వారం తిరగక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 

2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్‌ గన్స్‌ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్‌హౌజ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

చదవండి: మనిషే.. కుక్కను కరిచాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement