సిరియా.. ప్రపంచంలో గడచిన 12 ఏళ్లుగా అంతర్యుద్ధాలతో అట్టుడికికి పోతున్న ఏకైక దేశం. ఈ యుద్ధాల కారణంగా అక్కడున్న వారు సర్వం కోల్పోతున్నారు. ఆర్థిక, శారీరక, మానసిక కష్టాలతో నిత్యం కుంగిపోతున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలోని వారికి ఇప్పుడు యోగవిద్య వరప్రదాయనిగా మారింది.
బ్రిటీష్ మ్యాగజైన్ ఎకనామిస్ట్‌లోని ఒక రిపోర్టు ప్రకారం ప్రస్తుతం సిరియాలో ఉన్న అన్ని మైదానాలు, స్టేడియంలు యోగా తరగతులతో కళకళలాడుతున్నాయి. ఈ తరగతులకు పెద్దలు మొదలు కొని పిల్లల వరకూ అన్ని వయసులు వారు హాజరవుతున్నారు. వారి దినచర్య సూర్యనమస్కారాలతో ప్రారంభమవుతోంది.
సిరియాలో హిందువుల వేషధారణతో యోగా ట్రైనర్లు యోగ సాధనకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. యోగ విద్యను మహాశివుని వరప్రసాదంగా చెబుతున్నారు. సిరియాలో యోగ శిక్షణ అందిస్తున్న ఒక అధ్యాపకుడు మాట్లాడుతూ నిత్యం యుద్ధ భయంతో కొట్టుమిట్టాడుతున్న ఇక్కడి ప్రజలకు యోగ ద్వారా ప్రశాంతత పొందే విధానాలను వివరిస్తున్నట్లు తెలిపారు.
సిరియాకు చెందిన మాజోన్ ఈసా అనే వ్యక్తి రెండు దశాబ్ధాల క్రితం యోగా అధ్యయనం కోసం భారత్‌లోని హిమాలయాల్లో గల రిషికేశ్ వచ్చారు. తన యోగా అధ్యయనం ముగిశాక తిరిగి సిరియా చేరుకుని, ఒక యోగా సెంటర్ ప్రారంభించారు. ఇప్పుడు అతని ప్రేరణతో దేశంలో వేలాది యోగాకేంద్రాలు నడుస్తున్నాయి. కాగా ఈ కేంద్రాలలో ఉచితంగా శిక్షణ అందించడం విశేషం. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఇటువంటి యోగ శిక్షణ కేంద్రాలకు మద్దతుగా నిలుస్తున్నారు.
సున్నీ ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన సిరియాను అర్ధశతాబ్ద కాలంగా అసద్ కుటుంబ సభ్యులు పరిపాలిస్తున్నారు. వారు గతంలో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు ఇస్లాంలోని మరోశాఖ అల్విత్‌తో దోస్తీ కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు అసద్ కుటుంబ సభ్యుల తీరుతెన్నుల్లో మార్పు వచ్చింది. ఇతర మతాల వారికి కూడా తగిన గుర్తింపునిస్తున్నారు. దీనిలో భాగంగానే యోగ విద్యకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక్కడి క్రైస్తవులకు చర్చిలు నిర్మించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రియుని కోసం పాకిస్తాన్ వచ్చిన బ్రిటన్ మహిళ.. పోలీసులకు చుక్కలు!
Comments
Please login to add a commentAdd a comment