బుక్కెడు బువ్వ కోసం బతుకు పోరాటం.. | International Labour Day | Sakshi
Sakshi News home page

బుక్కెడు బువ్వ కోసం బతుకు పోరాటం..

Published Mon, May 1 2023 12:34 PM | Last Updated on Mon, May 1 2023 12:55 PM

International Labour Day  - Sakshi

కరీంనగర్‌: బుక్కెడు బువ్వ కోసం బతుకు పోరాటం.. కుటుంబపోషణకు ఆరాటం.. ఎండనకా.. వాననకా.. చలనకా.. రక్తాన్ని శ్వేదంగా చిందించి పొద్దంతా శ్రమిస్తే వచ్చే కూలి ఒక్కపూట తిండికి సరిపోని పరిస్థితి. ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. బతుకు బరువై తెలియని ప్రాంతానికి వలసవెళితే అక్కడా తప్పని శ్రమదోపిడీ. వేకువజాము నుంచి సందెవేళ దాకా శ్రమించినా కష్టాల ఊబినుంచి కార్మికులు బయటకు రాలేకపోతున్నారు. పాలకులు మారినా.. శ్రామికుల తలరాతలు మారడం లేదు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లేక అర్ధాకలితో అలమటించే వారు కోకొల్ల్లలు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో కనీస వేతన చట్టం, పనివేళలు బుట్టదాఖలు. ఉమ్మడి కరీంనగర్‌జిల్లా నుంచి వేలాది మంది కార్మికులు గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తుండగా.. జిల్లాకు సైతం వివిధ పనుల కోసం ఇతర రాష్ట్రాల వాళ్లు వస్తున్నారు. స్థానికంగా వేలాదిమంది వివిధ రంగాల్లో పనిచేస్తుండగా.. వచ్చే వేతనం అంతంతే.. నేడు మేడే సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కార్మికుల జీవన పరిస్థితి, అభిప్రాయాలతో ప్రత్యేక కథనం..

నేడు ఎగరనున్న ఎర్రజెండా..
చికాగోలో 8 గంటల పని దినాన్ని కల్పించాలని కోరుతూ కార్మికులు 1848లో పెద్దఎత్తున ఆందోళన చేశారు. ప్రభుత్వం వారిపై కాల్పులు జరపగా ఏడుగురు చనిపోయారు. ఏ మాత్రం వెనక్కు తగ్గని కార్మికులు రక్తంతో తడిసిన వారి చొక్కాలనే జెండాలుగా చేసి మే 1న భారీ ప్రదర్శన నిర్వహించారు. వారి పోరాట ఫలితంగా రోజుకు 8గంటలు మాత్రమే పని సమయం నిర్ణయించారు. ఆ పోరాటంలో వీరమరణం పొందిన వారికి చిహ్నంగా ఏటా మే 1వ తేదీని మేడేగా ప్రకటించారు. మేడే సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లాలోని వివిధ కార్మిక సంఘాలు, వామపక్షపార్టీల ఆధ్వర్యంలో వారివారి కార్యాలయాల్లో, పనిస్థలాల్లో జెండా ఆవిష్కరణలు, సభలు, సమావేశాలు అట్టహాసంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

సిరిసిల్లటౌన్‌: తెలంగాణాలోనే అతిచిన్న జిల్లాగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల శ్రామికుల ఉపాధికి అడ్డాగా మారింది. వ్యవసాయం, వస్త్రోత్పత్తి, హమాలీ తదితర రంగాల్లో మొత్తంగా 1.60లక్షల మంది రిజిష్టర్డ్‌ కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 2లక్షలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. 2000 ఏడాదికి అంతకుముందు సిరిసిల్ల డివిజన్‌ (ప్రస్తుతం జిల్లా)లో కరువు కాటకాలతో ముంబయి, దుబాయ్‌ వలసలు వెళ్లారు. ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్రసర్కారు ఆర్డర్లు, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, వివిధ కంపెనీల ఆర్డర్లు రావడంతో ఉపాధి పెరిగింది. ఫలితంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు వస్త్రోత్పత్తిలో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. జిల్లాలోని భవన నిర్మాణ రంగమూ విస్తరించడంతో కార్మికులకు డిమాండ్‌ పెరిగింది. భవననిర్మాణ రంగంలో స్థానికులు 42,000 మంది, వలస కార్మికులు 5వేల మంది పనిచేస్తున్నారు. చేనేతరంగంలో స్థానికులు 16వేల మంది, వలస కార్మికులు వెయ్యిమంది ఉన్నారు. హమాలీ రంగంలో స్థానికులు 6వేలు, 2వేల మంది వలస కార్మికులు ఉన్నారు.

రోజువారీ కూలీలుగా..
సుల్తానాబాద్‌/జ్యోతినగర్‌: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండం పరిధిలో వందలాది మంది వలసకార్మికులు పనిచేస్తున్నారు. ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో రోజువారీ కూలీలుగా కొనసాగుతున్నారు. అత్యధికంగా రైస్‌మిల్లులు ఉన్న సుల్తానాబాద్‌, మంథని, కమాన్‌పూర్‌ ప్రాంతాల్లో బిహార్‌ కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. జిల్లాలోని సుమారు 150 రైస్‌మిల్లుల్లో 7,500 మంది వరకు బిహారీలు ఉపాధి పొందుతున్నారు. రోజంతా కష్టపడితే వచ్చేది రూ.500 నుంచి రూ.వెయ్యి మాత్రమే. జిల్లాలోని ఇటుకబట్టీల్లో కార్మికుల పరిస్థితి అధ్వానం. 50కి పైగా ఇటుకబట్టీలు ఉండగా.. వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కోసారి వీరికి కనీసం తిండి పెట్టడంలేదని ఆందోళనకు దిగిన సందర్భాలు ఎన్నో. అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా.. యజమానులు ఇప్పటికీ వారిని బానిసల్లాగానే చూస్తుండడం ఆందోళనకరం.

వేతన ఒప్పందం ఏదీ?
గోదావరిఖని: 11వేజ్‌బోర్డు పూర్తిస్థాయి ఒప్పందం కోసం సింగరేణి కార్మికులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని రామగుండం రీజియన్‌ ఆర్జీ–1,2,3 ఏరియాల్లో సుమారు 11,500మంది పనిచేస్తున్నారు. గత సమావేశంలో మూలవేతనంపై 19శాతం పెంచేందుకు యాజమాన్యం అంగీకరించింది. అయితే అలవెన్స్‌ పెంపుపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఏప్రిల్‌ 18న కోల్‌కత్తాలో జరిగిన జేబీసీసీఐ 11వ వేజ్‌బోర్డు 9వ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పూర్తిస్థాయి వేతన ఓప్పందం కోసం తిరిగి సమావేశం కావాలని నిర్ణయించాయి. మారుపేర్ల మార్పు, విజిలెన్స్‌ కేసుల క్లియరెన్స్‌, అండర్‌గ్రౌండ్‌లో అన్‌ఫిట్‌ అయిన కార్మికులు సర్ఫేస్‌లో అదే ఉద్యోగం ఇస్తూ వేజ్‌ప్రొటక్షన్‌ తదితర డిమాండ్ల పరిష్కారంపై కార్మికులు ఎదురుచూస్తున్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. కోలిండియా మాదిరిగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీసవేతనాలు అందడం లేదు. జిల్లా పరిధిలోని సింగరేణిలో సుమారు నాలుగువేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు.

వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరం
కరీంనగర్‌ జిల్లాలో భవన నిర్మాణ, గ్రానైట్‌, తదితర రంగాల్లో 85వేల మందికిపైగా వలసకూలీలు ఉన్నారు. స్థానికులు 2లక్షలకు పైగానే ఉన్నారు. కార్మికశాఖ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఆధార్‌, రేషన్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ ఉంటేనే జిల్లాలో కార్మికుడిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. వలస వచ్చే కార్మికులకు అలాంటి అవకాశాలు లేకపోవడంతో అనధికారికంగా ఏజెంట్ల వద్ద పనిచేస్తూ సంవత్సరానికి కాంట్రాక్టు మాట్లాడుకుని పొట్ట పోసుకుంటున్నారు. జిల్లాలో ఇటుకబట్టీల్లో ఒడిశా కార్మికులు 3వేల మందికిపైగా ఉన్నారు. ప్లంబర్‌, పీవోపీ పనుల కోసం రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ కార్మికులు, లేబర్‌ పనుల కోసం ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రకు చెందినవారు 30వేల మందికిగాపైగా ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. ఇంటి నిర్మాణ మేసీ్త్రలుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు పదివేల కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో 550కిపైగా గ్రానైట్‌ క్వారీల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రకు చెందిన వారితో పాటు స్థానికులు కూడా పదివేల మందివరకు పనిచేస్తున్నారు. అరకొర వేతనాలతో ఒక పూట పస్తులుండి కాలం వెళ్లదీస్తున్న కుటుంబాలెన్నో. కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని గ్రానైట్‌వర్కర్స్‌ యూనియన్‌ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంది. వలస కార్మికులు పనిచేసే చోట ప్రమాదవశాత్తు మరణిస్తే అధికారికంగా ఎలాంటి సాయం అందడం లేదు.

అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు
కథలాపూర్‌(వేములవాడ): ఉన్న ఊరిలో సరైన ఉపాధిలేక పలువురు జిల్లా వాసులు ఉపాధిని వెతుక్కుంటూ అప్పులు చేసి వీసాలు కొనుగోలు చేసి ఇప్పటికీ గల్ఫ్‌ బాటపడుతున్నారు. అక్కడ సరైన ఉపాధి దొరక్కపోవడంతో అప్పు తీర్చేందుకు అరకొరవేతనాలతో కొందరు నెట్టుకొస్తుండగా.. మరికొందరు కొన్నిరోజులకే ఇంటిబాట పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో పనులు లేక కూలీలు పనుల కోసం జగిత్యా ల జిల్లాకు వస్తున్నారు. జిల్లాకు వలస వస్తున్న కూలీలు ఎక్కువగా కొనుగోలు కేంద్రాల్లో హమాలీలుగా, వరినాట్లు వేసేందుకు వస్తున్నారు. భవన నిర్మాణాల కోసం కూలీలు, మేస్త్రీలుగా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. జిల్లానుంచి లక్ష మందికి పైగా గల్ఫ్‌దేశాలకు ఉపాధికోసం వెళ్తుండగా.. ఇతర రాష్ట్రాల వాళ్లు దాదాపు 2,500 మంది ఇక్కడి పనిచేస్తున్నారు.

నేను రైతును.. గల్ఫ్‌బాట పట్టిన
నాలుగు ఎకరాల భూమిలో సాగుచేసిన. బోర్లు వేస్తే చుక్కనీరు రాలే. ఏళ్లుగా చూసిన ఏ ప్రాజెక్టు నీళ్లు మా శివారులకు చేరలే. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరకపోవడంతో గల్ఫ్‌ బాట పట్టిన. దుబాయిలో వాహనాల తయారీ కంపెనీలో కార్మికుడిగా పనిలోచేరిన. పని కష్టమైనప్పటికి డబ్బుల కోసం కష్టాన్ని దిగమింగుకునే పరిస్థితి నెలకొంది. గది, భోజనాల ఖర్చులు పోను నెలకు రూ.12 వేలు మిగులుతున్నాయి. గల్ఫ్‌ వలసకార్మికులతోపాటు రైతులు, కార్మికుల సంక్షేమాల కోసం ప్రభుత్వాలు ఆలోచించాలి. 
– పిడుగు రమేశ్‌, తాండ్య్రాల, కథలాపూర్‌

పేర్లు నమోదు చేసుకోవాలి
ఇతరరాష్ట్రాల నుంచి జిల్లాకు వస్తు న్న వలస కూలీలు ఆధార్‌, రేషన్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌తో తాము పనిచేస్తున్న యాజమాని అనుమతి తో కార్మికశాఖ కార్యాలయంలో పేరు నమోదుచేసుకోవాలి. చాలా మంది వలస కూలీలు ఇతరత్రా పనుల కోసం వస్తూ ఏడాది కాంట్రాక్ట్‌ ముగియగానే వారి య జమా ని ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంటారు. కార్మికశాఖ కార్యాలయంలో గుర్తింపు పొందినకార్డులు తీసుకున్న వారే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులు.
– ఎస్‌.రమేశ్‌బాబు, ఉప కార్మిక కమిషనర్‌, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement