పసుపు ధర ఎలా ఉంది..?
● మార్కెట్ యార్డును సందర్శించిన కలెక్టర్
మెట్‌పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లను గురువారం కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పసుపులో రకాలు..? దిగుబడి ఎంత వచ్చింది..? ఏ రకానికి ఎంత ధర పలుకుతోంది..? ఆ ధరలతో లాభమా? నష్టమా?.. అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కొనుగోలు చేసిన తర్వాత పసుపును ఎక్కడికి ఎగుమతి చేస్తారని అధికారులను అడిగారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు తరలిస్తారని వారు వివరించారు. పసుపును ఉడకబెట్టడానికి రైతులకు అవసరమైన పరికరాలు లేక నేరుగా యార్డుకు తీసుకొస్తుండడంతో తక్కువ ధర పలుకుతోందని తెలిపారు. దీనికి ఆయన గిట్టుబాటు ధర అందించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అనంతరం కార్యాలయంలో ఆన్‌లైన్ విధానంలో కొనుగోళ్ల తీరును తెలుసుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, సింగిల్ విండో చైర్మన్ కొమిరెడ్డి తిరుపతిరెడ్డి ఉన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
పట్టణంలో ఎల్‌ఆర్‌ఎస్ కింద వచ్చిన దరఖాస్తుల ను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మున్సిపల్ కార్యాలయాన్ని గురువా రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్తి పన్ను వ సూళ్లపై ఆరా తీసి గడువులోగా వంద శాతం వసూలు చేయాలని కమిషనర్ మోహన్‌కు సూచించారు.
‘పది’ ఫలితాల్లో ప్రతిభ కనబరచాలి
జగిత్యాల: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్‌లో జయీభవ.. విజయీభవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రశాంతమైన వాతావరణంలో.. ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలన్నారు. డీఈవో రాము, ఆర్డీవో మదుసూధన్ తదితరులు ఉన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
ధరూర్ క్యాంపులోగల ఈవీఎంల గోదాంను కలెక్టర్ తనిఖీ చేశారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులతో కలిసి ప్రతినెలా సందర్శిస్తున్నట్లు వివరించారు. అదనపు కలెక్టర్ లత ఉన్నారు.
మహిళలకు సమానహక్కులు
మహిళలకు ప్రభుత్వం సమానహక్కులు, చట్టాలు కల్పిస్తోందని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో ముందస్తు మహిళాదినోత్సవాన్ని నిర్వహించారు. లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులకు గురైతే 181 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. వైద్యం, న్యాయం, పోలీస్ కౌన్సిలింగ్ అన్ని రకాల సహాయాలు పొందవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment