వాతావరణ మార్పులతో అనారోగ్యం
జగిత్యాల: వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో టాస్క్‌ఫోర్స్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎండలు ముదిరి వాతావరణంలో మార్పుల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలన్నారు. వడదెబ్బకు గురికాకుండా చూడాలన్నారు. ఉపాధిహామీ కూలీలకు నీటి సదుపాయం కల్పించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, సమియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
27న బార్ అసోసియేషన్లకు ఎన్నికలు
జగిత్యాలజోన్: ఉమ్మడి జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్లకు మార్చి 27న ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నర్సింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సర్క్యులర్ కాపీని అన్ని బార్ అసోసియేషన్లకు పంపించారు. మార్చి 15న న్యాయవాదుల ఓటర్ లిస్ట్ ప్రకటించాలని, 17నుంచి 20వరకు నామినేషన్లు, 21న నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటన, 27న బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఎన్నికలను ఉదయం 10 గంటల నుంచి 4.30గంటల వరకు నిర్వహించాలని, తదనంతరం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి, ఫలితాలు ప్రకటించాలని సూచించారు. ఏప్రిల్ 1న కొత్త కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
వృద్ధురాలు అదృశ్యం
కథలాపూర్: కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన గుగ్గిల్ల గంగు(70) అదృశ్యమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గంగు తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. గురువారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాకపోవడంతో ఆమె బంధువులు పలువురిని వాకాబు చేశారు. గంగు అదృశ్యమైనట్లు ఆమె బంధువు గుగ్గిల్ల రాజారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment