లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం
జగిత్యాలజోన్: లోక్‌అదాలత్‌ల ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. నీలిమ అన్నారు. జిల్లాకోర్టులో శనివారం మెగా లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కక్షలతో సాధించేది ఏమీ లేదని, మానసిక ప్రశాంతతతో జీవించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నేరమయ జీవితానికి అలవాటు పడవద్దని, కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ.. కేసులతో విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జగిత్యాలరూరల్ మండలంలో చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదం కేసులో నష్టపరిహారంగా ఇన్సూరెన్సు సంస్థ నుంచి రూ.9లక్షల పరిహారాన్ని ఇప్పించారు. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురిలోని కోర్టుల్లో మొత్తంగా 1624 కేసులు పరిష్కరించారు. జిల్లా కేంద్రంలో ఐదు లోక్‌అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో జడ్జి నీలిమ, మొదటి అదనపు కోర్టులో జడ్జి నారాయణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి శ్రీనిజ, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జి జితేందర్, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జి వినీల్ కుమార్ కేసులను పరిష్కరించారు. బార్ అసోసియేషన్ జగిత్యాల అధ్యక్షుడు డబ్బు లక్ష్మారెడ్డి, లీగల్ ఎయిడ్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విజయ్‌కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ
జిల్లావ్యాప్తంగా 1,624 కేసులు పరిష్కారం
రూ.1.42 కోట్ల విలువైన పరిహారం అందజేత
Comments
Please login to add a commentAdd a comment