ఆగని అవినీతి దందా
● ఏసీబీకి చిక్కుతున్న లంచావతారులు ● పట్టుబడుతున్నా కనిపించని మార్పు ● మున్సిపాలిటీల్లో అభివృద్ధికి ఆటంకం ● తాజాగా పట్టుబడిన ధర్మపురి కమిషనర్ ● ఇన్‌చార్జి కమిషనర్లతోనే నెట్టుకొస్తున్న బల్దియాలు
జగిత్యాల: జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారుల అవినీతికి అంతులేకుండా పోతోంది. ప్రతిపనికీ లంచం డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫలితంగా బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తూ అవినీతి అధికారులను పట్టిస్తున్నారు. అయినా లంచావతారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. తాజాగా జిల్లాలోని ధర్మపురి మున్సిపల్ కమిషన్ శ్రీనివాస్ ఓ ఉద్యోగికి వేతనం చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కాడు. ఒప్పంద కార్మికులకు సంబంధించి వేతనాల చెల్లింపునకు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు వల పన్ని శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. అదేరోజు కోరుట్ల కమిషనర్ తిరుపతిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల మున్సిపల్ సిబ్బంది చేపట్టిన సర్వే వేతనాలు చెల్లించకపోవడం.. పన్ను వసూళ్లలో వెనుకబడి ఉండటంతో అతడిపై వేటు వేశారు. ఇలా ప్రతి మున్సిపాలిటీలో ఏదో సంఘటన చోటుచేసుకుంటోంది. కమిషనర్లు ఏదో కేసులో ఇరుక్కోవడం, ఇక్కడి నుంచి బదిలీ లేదా సస్పెండ్ కావడం, ఏసీబీ వలలో చిక్కడంతో ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
అవినీతి ఆగేదెన్నడో..
జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా శానిటేషన్, రెవెన్యూ విభాగాలతోపాటు టౌన్‌ప్లానింగ్ శాఖలో అమ్యమ్యాలు ఇస్తేనే పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేసిన టీపీవో గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆ ఘటనలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి హస్తం ఉండటంతో ఇద్దరూ సస్పెన్షన్ అయ్యారు. టౌన్‌ప్లానింగ్‌లో అత్యధికంగా అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇంటి అనుమతులకు ఎక్కువగా అమ్యామ్యాలు ముడితేనే ఇస్తున్నారని ఆరోపణలు ఉండగా.. శానిటేషన్ విభాగంలో పారిశుధ్య కార్మికులకు సంబంధించిన పరికరాల కొనుగోలులో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ విభాగంలో ముటేషన్లు చేపట్టడానికి ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతున్నట్లు అన్ని మున్సిపాలిటీల్లో ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment