మహిళల భద్రతకు షీటీంలు
● ఆకతాయిల ఆగడాలకు చెక్ ● ఫిర్యాదుల స్వీకరణకు సాంకేతిక పరిజ్ఞానం ● వేధింపులపై ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలు
జగిత్యాలక్రైం: జిల్లాలోని కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్‌లు ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా షీటీం బృందాలు ప్రత్యేకంగా జనసంచారం ఉన్నచోట మఫ్టీలో తిరుగుతూ.. పోకిరీలను పట్టుకుంటున్నాయి. జగిత్యాల, మెట్‌పల్లి సబ్ డివిజన్‌ల పరిధిలో షీటీం పోలీసులు ఆ శాఖ పనితీరుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగ డాలను వీడియో రికార్డ్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 20 మండలాల్లో షీ టీం బృందాలు పనిచేస్తున్నాయి. టీమ్‌లో ఎన్‌ఏ స్థాయి అధికారి, కానిస్టే బుల్ ఉంటారు.
అవగాహన సదస్సులు
ఆకతాయిలు వేదిస్తే వెంటనే షీటీంకు సమాచారం అందించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నారు. చీటింగ్‌పై పోలీసు శాఖ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటి వరకు 140 చోట్ల సదస్సులు నిర్వహించారు. వేధింపులకు గురిచేసే ఆకతాయిలు ఎక్కువగా సంచరించే 185 అడ్డాలను గుర్తించారు. ఇప్పటివరకు 40 ఫిర్యాదులు రాగా.. 5 కేసులు నమోదు చేశారు. 18 మందిపై ఈ–పెట్టి కేసులు నమోదు చేశారు. 22 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా షీటీం 120 పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే డయల్ 100 లేదా 87126 – 70783వాట్సప్ నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment