కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం | - | Sakshi
Sakshi News home page

కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం

Published Fri, Mar 28 2025 2:19 AM | Last Updated on Fri, Mar 28 2025 2:17 AM

కోరుట్ల: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని పాపులేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రతినిధులు గురువారం సందర్శించారు. ఆసుపత్రిలోని డాక్టర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆసుపత్రిలో నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాల అమలు, సిబ్బంది నియామకం, నిధుల వినియోగంపై చర్చించారు. జాతీయ స్థాయిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఎలా కొనసాగుతున్నాయో పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిసి ఆరోగ్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకున్నారు. వసతులు, ల్యాబ్‌ సేవలు, గర్భిణులు, ప్రసవానంతరం తల్లులకు అందించే సేవలు, పిల్లల వ్యాధి నివారణ టీకాలు తదితర అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సుపరింటెండెంట్‌ సునీతారాణి, డాక్టర్లు వినోద్‌ కుమార్‌, లక్ష్మీ, రమేశ్‌, జాతీయ ఆరోగ్య మిషన్‌ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ తులసి రవీందర్‌, టీబి ఇంచార్జి మల్లికార్జున్‌, తదితరులు పాల్గొన్నారు.

మత్స్య కార్మికులు పథకాలను వినియోగించుకోవాలి

జిల్లా అధికారి మనోజ్‌కుమార్‌

మెట్‌పల్లి: మత్స్య కార్మికులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని మత్స్య శాఖ జిల్లా అధికారి మనోజ్‌కుమార్‌ సూచించారు. పట్టణంలోని గంగపుత్ర సంఘం భవనంలో గురువారం మత్స్య కార్మికుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70ఏళ్ల లోపు ఉన్న ప్రతి కార్మికుడు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్మికుల ఉపాధిని మెరుగుపర్చడానికి ఏటా చేప పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. సమావేశంలో పర్రె శంకర్‌, కుడుముల సాయన్న, మగ్గిడి సురేష్‌, ఆర్మూర్‌ గంగన్న, పారిపెల్లి కిషన్‌, ఆర్మూర్‌ రంజిత్‌ తదితరులున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్‌ బ్రేకర్లు

జగిత్యాలక్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సురక్షిత ప్రయాణం అనే కార్యక్రమం ద్వారా గురువారం మల్యాల మండలం కొండగట్టు ఘాట్‌రోడ్‌ నుంచి కిందకు వచ్చి నేషనల్‌ హైవే 63ని కలిపే రహదారి వద్ద తరుచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుండటంతో మల్యాల సీఐ రవి, ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో రెండు స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. అధిక వేగంతో వస్తున్న వాహనాలు నియంత్రణలోకి వచ్చి ప్రమాదాల నివారణకు దోహదపడుతుందన్నారు.

ఉపాధ్యాయుడికి పురస్కారం

జగిత్యాల: విద్యారంగంలో విశేష కృషి చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అడ్డగట్ల గంగాధర్‌కు వరల్డ్‌ స్కూల్‌ సమ్మిట్‌ అనే సంస్థ పురస్కారాన్ని ప్రకటించింది. జగిత్యాలలోని టీఆర్‌నగర్‌ ఎంపీపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గంగాధర్‌.. చేతివేళ్ల ద్వారా లెక్కలు చేసి అబాకస్‌ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అత్యున్నతస్థాయి ప్రతిభవంతులుగా తీర్చిదిద్దారు. 721 సెకన్లలో విద్యార్థులు 1 నుంచి 100 ఎక్కాలు చదివించడంతోపాటు ఉచితంగా ఎందరికో అబాకస్‌ శిక్షణ అందించారు. వీటన్నింటిని పరిగణనలోకి వరల్డ్‌ స్కూల్‌ సమ్మిట్‌ ఆయనకు పురస్కారం ప్రకటించింది. ఏప్రిల్‌ 12న దుబాయ్‌లో జరిగే విశ్వపాఠశాలల శిఖర సమావేశంలో పురస్కారం అందించనున్నట్లు వరల్డ్‌ స్కూల్‌ సమ్మిట్‌ ఆర్గనైజర్‌ అక్షయ అహుజ తెలిపారు.

కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం1
1/3

కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం

కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం2
2/3

కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం

కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం3
3/3

కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement