ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలి
● అదనపు కలెక్టర్ లత
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, సంఘాల సీఈఓలతో గురువారం శిక్షణ ఇచ్చారు. రైతులంతా ఒకేసారి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురాకుండా చూడాలని, ధాన్యానికి సీరియల్ నంబర్లు ఇచ్చి, ఆ మేరకు కొనుగోలు చేయాలని తెలిపారు. కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఐకేపీ సంఘాలకు పోటీగా సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తాయన్నారు. ధాన్యం కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మేనేజర్ జితేందర్ ప్రసాద్, అధికారి జితేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, రవాణా, మెట్రాలజీ శాఖల అధికారులు పాల్గొన్నారు.