
‘రోళ్లవాగు’ నిధులతో అడవుల అభివృద్ధి
సారంగాపూర్: బీర్‌పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం 90 శాతం పూర్తయ్యింది. అయితే ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న అటవీప్రాంతంపై మాత్రం అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో గేట్లను అమర్చలేదు. ఫలితంగా ప్రాజెక్టులోకి వర్షాకాలంలో గుట్టల నుంచి, వాగుల ద్వారా వచ్చే నీటితోపాటు, ఎస్సారెస్పీ నుంచి డి–53, 12ఎల్ కాలువ ద్వారా చేరే నీరు దిగువకు వెళ్లిపోతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తయినా రైతులకు సాగునీరందడం సమస్యగా మారింది.
ప్రాజెక్టు నిర్మాణం ఇలా..
బీర్‌పూర్ శివారులో రూ.136.81 కోట్ల వ్యయంతో 2015–16లో అప్పటి ప్రభుత్వం పనులు చేపట్టింది. బీర్‌పూర్, ధర్మపురి మండలాల్లోని 15వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణం 90శాతం వరకు పూర్తయింది. ఇంకా సాగునీరు అందించేందుకు మూడు గేట్లు మాత్రమే బిగించాల్సి ఉంది. ప్రాజెక్టు ముంపులో అటవీశాఖ భూములు ఉండడంతో ఆ శాఖ అనుమతి ఇస్తేగానీ గేట్లు బిగించడం కుదరదు. ప్రాజెక్టులో సుమారు 816 ఎకరాల అటవీశాఖ భూములు ముంపునకు గురవుతుండడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొల్లపల్లి మండలం చందోళి, దట్నూర్, వెల్గటూర్ మండలంలోని జగదేవ్‌పేట గ్రామాల్లో విస్తరించిన గుట్టలు, అలాగే పెగడపల్లి మండలం దివికొండ, ల్యాగలమర్రి, నంచర్లలో విస్తరించిన మరో గుట్టను అటవీశాఖకు అప్పగించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులతోపాటు డీఎఫ్‌ఓ సర్వే చేసి ప్రాజెక్టు నిర్మాణంలో సుమారు 53వేల చెట్లు మునిగిపోతున్నాయని తేల్చారు. ఎత్తు ప్రాంతాల్లో ఉన్న సుమారు 15వేల చెట్లకు నీరు తగ్గుతున్న కొద్ది నష్టం ఉండకపోవచ్చని అంచనా వేశారు. నల్లగొడిశ, నెమళినార, పాలగొడిశ, బిల్లుడు, ఇప్ప, తెలమద్ది, టేకు, మోదుగు, నల్లమద్ధి, కానుగ, చొప్పరి, సోమి, మెడిసినల్ ప్లాంట్స్ మారేడు, తవిసి, మర్రి, రావి, జువ్వి, వేప, తునికి పళ్ల చెట్లు ఉన్నాయని నిర్ధారించారు.
ట్రాన్స్‌లోకేషన్, ట్రాన్స్‌ప్లాంటేషన్
అరుదైన చెట్లయిన మారేడు, తవిసి, మర్రి, రావి, జువ్వి, వేప, తునికి చెట్లను ప్రాజెక్టు శివారు నుంచి యంత్రాల ద్వారా కూకటివేళ్లతో తీసుకెళ్లి పోతారం, తుంగూర్, బీర్‌పూర్ అటవీప్రాంతంలో నాటడానికి (ట్రాన్స్‌ప్లాంటేషన్) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక చెట్టును 48 గంటల్లోనే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది.
ప్రాజెక్టు నిధులతో అటవీ భూముల్లో అభివృద్ధి
రోళ్లవాగు నిర్మాణంలో అటవీశాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు కేటాయించే నిధులతోనే ఆ శాఖకు సంబంధించిన భూములు అభివృద్ధి చేయనున్నారు. అడవుల అభివృద్ధికి దాదాపు రూ.25కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది. ఈ నిధులతో అటవీశాఖకు కేటాయించిన 816 ఎకరాల గుట్టల ప్రాంతంలో అడవులను పెంచనున్నారు. సుమారు మూడు వేల చెట్లను ట్రాన్స్‌లోకేషన్, ట్రాన్స్‌ప్లాంటేషన్ కింద తిరిగి నాటడానికి నిధులు ఖర్చు చేస్తారు.
భూగర్భజలాల పెంపు కోసం
జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలోని అటవీప్రాంతాల్లో భూగర్భజలాల పెంపుకోసం చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల, రాయికల్ రేంజ్‌లు, ధర్మపురి నియోజవర్గ పరిధిలోని ధర్మపురి రేంజ్‌లో నీటి వనరుల పెంపు లక్ష్యంగా అడవుల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.లక్షలు వెచ్చించనున్నారు.
పర్యావరణ అనుమతుల వస్తే పనులు
అటవీశాఖ, ఇంజి శాఖ అధికారులు రెండు నెలలపాటు అనువణువునా చెట్లను లెక్కించారు. వారిచ్చిన వివరాలను ఇటీవల అటవీశాఖ పరిధిలోని పర్యావరణ పరిరక్షణ బృందం సభ్యులు, సీనియర్ అటవీ అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేశారు. ఈ నివేదికలను పర్యావరణ అనుమతుల కోసం ఢిల్లీలోని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌కు పంపినట్లు ఇరు శాఖల అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు ముంపులో అటవీశాఖ భూములు
ధర్మపురి సెగ్మెంట్ పరిధిలో 816 ఎకరాలు కేటాయింపు
అడవుల పెంపకానికి రూ.30 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం
మూడు వేల చెట్ల వరకు ట్రాన్స్‌లోకేషన్, ట్రాన్స్‌ప్లాంటింగ్
జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాల్లో ఖర్చు చేయనున్న నిధులు
మినీ పర్క్యూలేషన్
ట్యాంకులు
స్టాగర్డ్
రేంజ్
పర్క్యూలేషన్
ట్యాంకులు
ట్రెంచెస్

‘రోళ్లవాగు’ నిధులతో అడవుల అభివృద్ధి

‘రోళ్లవాగు’ నిధులతో అడవుల అభివృద్ధి

‘రోళ్లవాగు’ నిధులతో అడవుల అభివృద్ధి