
సబ్‌స్టేషన్‌లలో ఆపరేటర్ల కొరత
● ట్రాన్స్‌కో సిబ్బందిపై అదనపు భారం ● గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారంలో జాప్యం
కథలాపూర్(వేములవాడ): రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతుంటే.. అందుకు తగ్గట్లుగా ట్రాన్స్‌కో అధికారులు సిబ్బంది నియామకంపై దృష్టిసారించడంలేదనే ఆరోపణలున్నాయి. ఉన్న సిబ్బందితో నెట్టుకురావడంతో విద్యుత్ సమస్యలు వస్తే పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇందుకు నిదర్శనం కథలాపూర్ మండలంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్(ఆర్టిజియన్)ల కొరత. ఆర్టిజియన్‌ల కొరతతో గ్రామాల్లో పనిచేసే ట్రాన్స్‌కో జేఎల్‌ఎంలతో నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయి ఆర్టిజియన్లు ఉంటే జేఎల్‌ఎంలపై అదనపు భారం పడదని, విద్యుత్ సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే వీలుంటుందని ప్రజలు భావిస్తున్నారు.
కథలాపూర్ పరిధిలో ఏడు సబ్‌స్టేషన్లు
కథలాపూర్ మండలంలో 19 గ్రామాలుండగా.. కథలాపూర్, భూషణరావుపేట, బొమ్మెన, చింతకుంట, తాండ్య్రాల, గంభీర్‌పూర్, అంబారిపేట గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఏడు సబ్‌స్టేషన్‌లలో కథలాపూర్ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్ ఆపరేటింగ్ కోసం ముగ్గురు చొప్పున ఆరు సబ్‌స్టేషన్‌లకు 18 మంది ఆర్టిజియన్‌లు అవసరం. కానీ, 9 మందితో నెట్టుకొస్తున్నారు. బొమ్మెన సబ్‌స్టేషన్‌లో ఆర్టిజియన్‌లు లేకపోవడంతో ట్రాన్స్‌కో సిబ్బంది షిఫ్టులవారీగా నిర్వహిస్తున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్‌లో ఒకరోజుకు మూడు షిఫ్ట్‌ల్లో ఒక ఆర్టిజియన్ 8 గంటలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
సమస్యల పరిష్కారంలో జాప్యం
విద్యుత్ సబ్‌స్టేషన్‌లను ఆపరేటింగ్ చేసే ఆర్టిజియన్‌ల కొరత కారణంగా ట్రాన్స్‌కో జేఎల్‌ఎంలు సబ్‌స్టేషన్‌లలో విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు వస్తే సంబంధిత జేఎల్‌ఎం నిమిషాల్లో అక్కడకు చేరుకొని పరిష్కరించాల్సి ఉంటుంది. కాగా, జేఎల్‌ఎంలు సబ్‌స్టేషన్‌లలో ఉంటే గ్రామాల్లో విద్యుత్ వైర్లు తెగడం, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజ్ పోతే మరమ్మతులో జాప్యం జరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. పొద్దంతా విద్యుత్ సమస్య వస్తే ఏమోగానీ రాత్రివేళ అయితే వినియోగదారులు ఇబ్బందిపడే అవకాశముంది. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు దృష్టిసారించి విద్యుత్ సబ్‌స్టేషన్‌లలో సరిపడా ఆర్టిజియన్లను నియమించి, ట్రాన్స్‌కో జేఎల్‌ఎంలను వారికి కేటాయించిన గ్రామాల్లో యథావిధిగా విధులు నిర్వర్తించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.