
ఈ–మెయిల్ ద్వారా జైళ్లకు బెయిల్ ఆర్డర్ కాపీలు
● జిల్లాలోని అన్ని కోర్టులకూ ఉత్తర్వులు ● ఆదేశాలు జారీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జగిత్యాలజోన్: వివిధ నేరాలకు పాల్పడి.. ఆయా కేసుల్లో జైళ్లలో విచారణ ఖైదీలుగా ఉన్న నిందితులకు కోర్టులు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. సకాలంలో కోర్టు ఆర్డర్ కాపీలు జైళ్లకు చేరకపోవడంతో విడుదలలో జాప్యం జరుగుతోంది. నిందితుల కేసు ఓ కోర్టులో ఉండటం, నిందితుడు మరో జైళ్లో ఉండటంతో బెయిల్ మంజూరైనా ఆర్డర్ కాపీని జైలులో అందజేయడం అటు కక్షిదారులు, ఇటు న్యాయవాదులకు సవాల్‌గా మారింది. ఉదాహరణకు: జగిత్యాల పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో నిందితుడు చర్లపల్లి జైల్లో ఉంటే.. జగిత్యాల కోర్టు బెయిల్ మంజూరు చేస్తే.. ఆ ఆర్డర్‌ను చర్లపల్లి జైలుకు తీసుకెళ్లడం కుటుంబసభ్యులకు పెద్ద సమస్యగా మారింది. బెయిల్ మంజూరైన తర్వాత నిందితుడి తరఫున ష్యూరిటీ పెట్టడం, వాటిని చెక్ చేసి, జైలుకు బెయిల్ ఆర్డర్ పంపడంలో చాలా సమయం గడిచిపోతోంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత జైలు అధికారులు కోర్టులు ఇచ్చే రిలీజ్ ఆర్డర్‌ను తర్వాత రోజు ఓపెన్ చేస్తారు. అప్పటివరకు నిందితుల విడుదలలో జాప్యం జరుగుతుంది. నిందితుల తరఫున ఎవరూ లేకుంటే బెయిల్ ఆర్డర్‌ను జైలుకు తీసుకెళ్లడం కూడా కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రత్న పద్మావతి బెయిల్ ఆర్డర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
నేరుగా జైళ్లకే ఈ–మెయిల్ ఆర్డర్లు
బెయిల్ ఆర్డర్ లేదా రిలీజ్ ఆర్డర్ కాపీని నేరుగా జైళ్లకు ఈ–మెయిల్ ద్వారా పంపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా నిందితులకు సత్వర ఉపశమనం కలిగి, జైలు నుంచి త్వరగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మేరకు జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి కోర్టులతోపాటు, అన్ని జైళ్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితులు ఉండే చర్లపల్లి సెంట్రల్ జైలు, చంచల్‌గూడ మహిళా జైలు, కరీంనగర్ జిల్లా జైలు, జగిత్యాల స్పెషల్ సబ్ జైలుల ఈ–మెయిల్ ఐడీలను కూడా అన్ని కోర్టులకు పంపించారు. ఇకనుంచి జిల్లాలోని అన్ని కోర్టులు మంజూరు చేసే బెయిల్ లేదా రిలీజ్ ఆర్డర్లను ఈ–మెయిల్ ద్వారా నిందితులు ఉండే జైళ్లకు పంపించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.