ఎన్నికలకు వేళాయె..
జనగామ: మహిళా సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత సంఘాల పదవీ కాలం మార్చితో ముగియనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మహిళా శక్తి ప్రోగ్రామం ద్వారా ఆర్థిక బలోపేతం సాధించే విధంగా సంఘాలకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా మండల, గ్రామ, జిల్లా స్థాయిలో సంఘాలకు కొత్త సారథులను ఎన్నుకునేందుకు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో సెర్ప్ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
శిక్షణ..
జిల్లాలో 466 వీఓ, 11,240 సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులు ఉండగా.. 1,28,115 మంది మహిళా సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘మహిళా శక్తి మెంబర్ మొబిలైజేషన్’ కార్యక్రమంలో 1,716 సంఘ సభ్యులను చేర్చుకోవాలనే లక్ష్యం మేరకు 355 వీఓల పరిధిలో 2,013 మందికి సభ్యత్వం ఇచ్చి 117.31 శాతం అదనంగా అచ్ఛీవ్‌మెంట్ సాధించారు. కొత్త సంఘాల ఏర్పాటుకు హైదరాబాద్‌లో డీపీఎం, ఏపీఎం స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వగా, జిల్లా, గ్రామ, మండల లెవల్‌లో వీఓ, వీఓఏ, సెర్ప్ సిబ్బంది, మండల, గ్రామ సమాఖ్యలకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుత కమిటీల పదవీ కాలం మార్చిలో ముగియనుండగా.. కొత్త సారథులు ఏప్రిల్ చివరి వారంలో బాధ్యతలను తీసుకోనున్నారు.
కసరత్తు షురూ..
పాత, కొత్త సంఘాలను కలుపుకుని కొత్త సారథుల ఎన్నికలో భాగంగా ఈ నెల చివరి వారం నుంచి ఎలక్షన్ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. నూతన సంఘాల పదవీ కాలం ఏడాది నుంచి మూడు సంవత్సరాలపాటు ఉంటుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, పాలకవర్గ సభ్యులను చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకోనున్నారు. స్వయం సహాయ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సీ్త్ర నిధి ద్వారా పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేస్తోంది. జిల్లాలో 2024–25 వార్షిక సంవత్సరంలో 4,644 ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.431 కోట్ల రుణాలు ఇవ్వగా.. 90.48 శాతం మేర లక్ష్యాన్ని చేరుకున్నారు. మహిళా క్యాంటీన్లు, చిరు వ్యాపారాల్లో సంఘాలు రాణిస్తూ.. ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి. సంఘాల బలోపేతం, లావాదేవీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుల పాత్ర కీలకమని చెప్పుకోవచ్చు. మహిళా సంఘాలకు కొత్త సారథులను ఎన్నుకునేందుకు ఏకగ్రీవం లేదా చేతులెత్తే పద్ధతి, చీటీల ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు చేపడతారు. మొదట గ్రామ సంఘ అధ్యక్షురాలు.. అక్కడ నుంచి మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నుకోబడుతారు. మండల అధ్యక్షులు కలిసి జిల్లా సమాఖ్య అధ్యక్షులను ఎన్నుకుంటారు. మండల సమాఖ్య ఎలక్షన్లను ఈ నెల చివరి వరకు పూర్తి చేసి, మార్చి నాలుగవ వారంలో జిల్లా సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్ష, పాలక మండలి సభ్యులను ఎన్నుకుని, ఏప్రిల్‌లో నూతన కమిటీలచే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
మహిళా సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎలక్షన్లు
ఏప్రిల్ వరకు ప్రక్రియ పూర్తి
మార్చి వరకు పని చేయనున్న ప్రస్తుత కమిటీలు
జిల్లాలో 1.28 లక్షల మంది సభ్యులు
జిల్లాలో మహిళా సంఘాల వివరాలు
మండలాలు 12
పంచాయతీలు 280
రుణాల టార్గెట్
రూ.476.47 కోట్లు
రుణాల మంజూరు
రూ.431 కోట్లు
వీఓలు 466
ఎస్‌హెచ్‌జీ 11,240
మొత్తం సభ్యులు
1,28,115
Comments
Please login to add a commentAdd a comment