సమీపిస్తున్న గడువు..
జనగామ రూరల్: గ్రామాల్లో పన్నుల వసూలు జోరుగా సాగుతోంది. గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులు ఎంత కీలకమో.. పంచాయతీల్లో వసూలయ్యే పన్నులు అంతే అవసరం. అయితే ఏడాదిగా ఎస్‌ఎఫ్, 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోవడంలో జీపీలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. ఇన్నాళ్లు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు కృషి చేసిన కార్యదర్శులు ప్రస్తుతం పన్నుల వసూలుపై దృష్టి సారించారు. ఉదయం 8గంటలకే గ్రామాలకు చేరుకుని సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యం(బకాయిలతో) రూ.7,11,32,109. ఇందులో ఇప్పటి వరకు రూ.5,72,20,972(80 శాతం) వసూలైంది. ఇంకా 1,39,11,137 వసూలు చేయాల్సి ఉంది. గ్రామ పాలనలో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర. వీరంతా మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజాపాలన, ఇంది రమ్మ ఇళ్ల సర్వేల్లో బీజీబీజీగా గడిపారు. దీంతో పన్నుల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆర్థిక సంవత్సరం మరో నెల తొమ్మిది రోజుల్లో ముగియనుంది. గడువులోపు నూరుశాతం లక్ష్యసాధనకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
37 పంచాయతీల్లో వందశాతం
జిల్లాలో 283 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 37 జీపీలు ఇప్పటికే వందశాతం పన్ను వసూలు చేసి ఆదర్శంగా నిలిచాయి. వీటిలో పాలకుర్తి మండల పరిధిలో 10 జీపీలు, దేవరుప్పులలో 8, చిల్పూరు, తరిగొప్పుల పరిధిలో 4 చొప్పున, బచ్చన్నపేట, జనగామ 3 చొప్పున, జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్ 2 చొప్పున, కొడకండ్లలో ఒక గ్రామపంచాయతీ వందశాతం పూర్తి చేశాయి. పన్ను వసూళ్లలో అత్యంత వెనుకబడిన పంచాయతీలను పరిశీలిస్తే.. రఘునాథపల్లి మండలంలో జాఫర్‌గూడెం 24 శాతం, మల్లంపల్లి 28 శాతం, ఇబ్రహీంపూర్‌లో 34 శాతం, దేవరుప్పుల మండలం లకావత్‌తండా 32 శాతంతో వెనుకబడి ఉన్నాయి.
నూరుశాతం పన్ను వసూలు లక్ష్యం
ఇప్పటి వరకు 80.44 శాతం పూర్తి
వందశాతం వసూలు చేసిన జీపీలు 37
లక్ష్య సాధన దిశగా ముందుకు..
వివిధ సర్వేలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా మొన్నటి వరకు పంచాయతీ కార్యదర్శులు బీజీగా ఉండటం ద్వారా పన్నుల వసూళ్లకు అవరోధం ఏర్పడింది. ప్రస్తుతం వసూళ్లపై దృష్టి సారించారు. ప్రతీ పంచాయతీలో పన్నులు వంద శాతం వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశించాం. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం.
– స్వరూప, డీపీఓ
సమీపిస్తున్న గడువు..
Comments
Please login to add a commentAdd a comment