20 ఫీట్లతో ఇబ్బందులే..
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ రైల్వే ట్రాక్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మా ణం పూర్తయినా ప్రయోజనం లేకుండా పోనుందా.? అంటే క్షేత్రస్థాయి పనులు జరుగుతోన్న తీరు చూస్తే ఔనన్నదే సమాధానం.. అధికారుల అనాలో చిత చర్యలు, నిర్ణయాలు, నిర్లక్ష్యంతో ఓ వైపు ఆర్‌యూబీ ఇరుకుగా మారనుంది. ఒక వాహనం వెళ్లాక మరో వాహనం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ని డిగొండ నుంచి ఫతేషాపూర్, ఇబ్రహీంపూర్, మా దారం, లక్ష్మీతండా, ఖిలాషాపూర్ గ్రామాలకు వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ వద్ద రూ.6 కోట్లతో ఆర్‌యూబీ నిర్మిస్తున్నారు. ట్రాక్ ఇరువైపులా 497 ఫీట్ల పొడవుతో నిర్మాణం పనులు చేపట్టారు. అయితే పూర్థిస్థాయిలో సమస్య పరిష్కారమయ్యేలా పనులు జరగడం లేదు. ఫతేషాపూర్ వైపు అప్రోచ్ రోడ్డు 32 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తుండగా.. నిడిగొండ వైపు మాత్రం 20 ఫీట్లకే పరిమితం చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగే అవకాశం లేకుండా పోనుంది.
ఎందుకిలా..?
ట్రాక్ వద్ద ఫతేషాపూర్ వైపు 32 ఫీట్లు చూపిన రోడ్డును నిడిగొండ వైపు 20 ఫీట్లుగా రెవెన్యూ అధికారులు చూపినట్టుగా తెలుస్తోంది. నక్ష ప్రకారం మార్కింగ్ చేశామని అధికారులు చెబుతున్నా.. ఓ వైపు 32 ఫీట్లు, మరో వైపు 20 ఫీట్లు ఎలా ఉంటుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెవెన్యూ అధికారులు నక్ష ప్రకారం ఇచ్చిన వివరాల ఆధారంగా ఆర్‌యూబీ డిజైన్ చేశామని రైల్వే అధికారులు.. ఒప్పందం ప్రకారం పనులు చేస్తున్నానని కాంట్రాక్టర్ చెబుతున్నారు. ట్రాక్ వద్ద నిడిగొండ వైపు ఉన్న ప్రైవేట్ వ్యక్తుల భూమి సేకరించేందుకు పలు గ్రామాల నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రైల్వే డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లగా జిల్లా కలెక్టర్‌ను కలవాలని యోచిస్తున్నారు. ఇటీవల ఆర్‌యూబీ పనులను సందర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. భూమి ఇచ్చేలా యజమానులను ఒప్పించాలని, సేకరణకు తాను కొన్ని డబ్బులు ఇస్తానని చెప్పారు. దీంతో పలుమార్లు భూ యజమాని మడ్లపల్లి రాజు, కొలిపాక రాజ్‌కుమార్‌లతో నాయకులు మాట్లాడారు. ఆర్‌డీఓ వద్దకూ వారిని తీసుకెళ్లి చర్చించారు. నిడిగొండ వైపు భూసేకరణకు స్వచ్ఛందగా తాము కొంత డబ్బులు చెల్లిస్తామని నాయకులు పేర్కొనగా.. బహిరంగ మార్కెట్ ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని భూ యజమానులు పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో భూసేకరణ విషయం కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే అందుబాటులో ఉన్న స్థలంలో 20 ఫీట్ల వెడల్పుతో కాంట్రాక్టర్ పనులు కొనసాగిస్తున్నాడు. మేమేం చేయలేమని రైల్వే అధికారులు చెబుతుండటం గమనార్హం.
చట్టం ప్రకారం..
ప్రజాప్రయోజన ప్రాజెక్టుల కోసం 2013 చట్టం ప్రకారం భూమి సేకరించే అధికారం ప్రభుత్వ విభాగాలకు ఉంది. ఇక్కడ మాత్రం అధికారులు ఆ దిశగా కసరత్తు చేయడం లేదు. చట్టం ప్రకారం సేకరణకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్న దృష్ట్యా.. సంప్రదింపుల ద్వారా భూసేకరణ చేయాలనుకుంటున్నాయని ఓ అధికారి తెలిపారు. భూమి సేకరించకుండా నిడిగొండ వైపు కేవలం 20 ఫీట్లతో అండర్‌గ్రౌండ్‌లో రోడ్డు నిర్మిస్తే.. ఇబ్బందులు తప్పవని ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా ఇరువైపులా 32 ఫీట్లతో అండర్‌గ్రౌండ్‌లో రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిడిగొండ వైపు 20, ఫతేషాపూర్ వైపు 32 ఫీట్లు
ఒక్కో వైపు ఒక్కోలా నిడిగొండ ఆర్‌యూబీ నిర్మాణం
అధికారుల అనాలోచిత నిర్ణయాలు
20 ఫీట్లతో ఇబ్బందులే..
Comments
Please login to add a commentAdd a comment