తెలంగాణలో శాసన మండలి నిర్వీర్యం
జనగామ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలిని నిర్వీర్యం చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అధ్యక్షతన జరిగిన ఓటర్ల సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి మాట్లాడారు. సరోత్తంరెడ్డి ఉత్తముడని కొనియాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరోత్తంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వచ్చే శివరాత్రి పర్వదినం రోజున ఒక్కపొద్దు ఉండి, ఆదేరోజు ఓటు వేసి ఉపవాస దీక్ష వీడాలని పిలుపునిచ్చారు. గతంలో ప్రభుత్వం అంటే ఉపాధ్యాయులు అనే ఉద్దేశంతోనే శాసనసభతోపాటు శాసనమండలిలో ఎమ్మెల్సీ ఎన్నుకునే ప్రక్రియను తీసుకొచ్చారన్నారు. తన గురువు రామారావుకు ఎన్నికల సమయంలో అనేక మంది చందాలు పోగు చేసి అండగా నిలిచారన్నారు. గతంలో మంత్రులు శాసనమండలికి రావాలంటే వణికి పోయేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. బీజేపీ మాత్రం ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసే భాగంలో వారి వెంటే ఉంటుందన్నారు. కేంద్రం డీఏ, వేతనాలు సకాలంలో చెల్లిస్తుంటే, రాష్ట్రంలో దారుణంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పుల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కృషితో హైదరాబాద్‌కు కంపెనీలు వస్తున్నాయని, ప్రధాని దెబ్బకు పాకిస్తాన్ అడుక్కునే పరిస్థితికి చేరుకుందన్నారు. గ్రామ పంచాయతీలకు గత ప్రభుత్వం 10ఏళ్ల పాటు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వచ్చే విధంగా చూడాలని కోరుతూ దేవాదుల లిఫ్టు ఇరిగేషన్ కాంట్రాక్టు వర్కర్లు పి.సాయిలు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ మంత్రి గుండె విజయరామారావు, ఎమ్మెల్సీ, జిల్లా ఇన్‌చార్జ్ రాజమౌళిగౌడ్, నాయకులు బొజ్జపల్లి సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శివరాజ్‌యాదవ్, దుబ్బా రాజశేఖర్‌గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి హరిశ్చంద్రగుప్త, అనిల్ గౌడ్ తదితరులు ఉన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
జనగామలో ఎమ్మెల్సీ ఓటర్ల సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment