రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
స్టేషన్‌ఘన్‌పూర్: గ్రామ పంచాయతీ (జీపీ)ల రికార్డుల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా వ్యవహరించాలని, పన్నుల వసూళ్లు, ఖర్చులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. మండలంలోని నమిలిగొండ గ్రామంలో అదనపు కలెక్టర్ శనివారం పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి అందులో ఉన్న రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు రూ.60వేలు రావడంపై ఆరా తీశారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న పాంఫౌండ్ పనులను, ఉపాధి పనులు, నర్సరీని, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. అలాగే నమిలిగొండలో స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా మంజూరై నిర్మాణం చేపట్టిన మరుగుదొడ్లను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈనెల 28లోపు నిబంధనలకు లోబడి మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవాలన్నారు. నిర్మాణం పూర్తయిన వారు మరుగుదొడ్డి ఫొటో, బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, ఈజీఎస్ జాబ్‌కార్డు జిరాక్స్‌లతో వివరాలను కార్యదర్శికి అందించాలన్నారు. ఆయన వెంట ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీడీ చంద్రశేఖర్, ఎస్‌బీఎం జిల్లా కోఆర్డినేటర్ కరుణాకర్, ఎంపీడీఓ విజయశ్రీ, ఎంపీఓ నర్సింహారావు, ఏపీఓ ప్రేమయ్య, పంచాయతీ కార్యదర్శులు జేసుమణి, సునీల్, టీఏ సుజాత, కారోబార్ రాంచందర్, ఎఫ్‌ఏ అమీనా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment