కొడకండ్ల : మండల పరిధి పెద్దబాయితండా జీపీ కార్యదర్శి కె.సోమేశ్వర్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధులపై నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారిపై మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్, స్థానిక గిరిజనులు ఈనెల 14న జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశం మేరకు డీపీఓ స్వరూప విచారణ చేపట్టగా జీపీ రికార్డులు అప్‌డేట్ లేకపోవడం.. నిబంధనల మేరకు సమావేశాలు, గ్రామసభలు నిర్వహించకపోవడం.. కొన్ని రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడం.. రశీదు బుక్‌లో మొత్తం రూ.3,73,633 వసూలు చేసి రూ.1,82,900 మాత్రమే జమచేసి మిగతా మొత్తం చేతి నిల్వగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఖర్చుల నిమిత్తం తీర్మానాలు, రికార్డులు లేకుండా చెక్కుల ద్వారా చెల్లించారనే ఆరోపణలపై డీపీఓ పరిశీలించారు. బండారి నాగరాజు అనే వ్యక్తి అకౌంట్‌కు గ్రామ పంచాయతీకి చెందిన వివిధ ఖాతాల నుంచి రూ.11,93,388 జమ చేయడం, ఇందిరమ్మ ఇళ్ల సర్వే అస్సెస్‌మెంట్‌కు ఆన్‌లైన్ కాకుండా ఒక్కొక్కరి వద్ద రూ.3,500 చొప్పున మొత్తం రూ.1,43,500 వసూలు చేసినట్లు రశీదుల ద్వారా గుర్తించి నివేదిక ను కలెక్టర్‌కు అందజేశారు. ఈ మేరకు కార్యదర్శిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ఆ సమయంలో ప్రత్యేక అధికారి గా వ్యవహరించిన ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ భవానీకి క్రమశిక్షణ లోపంపై హెచ్చరిక నోటీస్ ఇచ్చారు.
అధికారికి కూడా నోటీస్ జారీ
Comments
Please login to add a commentAdd a comment