‘అపార్’ ఆలస్యం
జనగామ రూరల్: ప్రతి విద్యార్థికి శాశ్వత గుర్తింపు నంబర్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘అపార్’(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ ఎకౌంట్ రిజిస్ట్రీ) నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఆధార్ కార్డులో తప్పలతో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు 12 అంకెలతో కూడిన ‘అపార్’ గుర్తింపు కార్డు జారీ చేయాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించిన కేంద్రం.. రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు విద్యాసంస్థల నిర్వాహకులు ఆధార్ కార్డు ప్రకారం విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఆధార్ వివరాల్లో తప్పులను సరిచేసుకునేందుకు విద్యార్థులు ఆధార్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ జాప్యం అవుతుండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో 658 పాఠశాలలు, 76,263 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటి వరకు 48,356(63.41శాతం) మంది వివరాల నమోదు పూర్తయింది. అత్యధికంగా నర్మెట మండలంలో 70.53 శాతం, అత్యల్పంగా బచ్చన్నపేట మండలంలో 59.59 శాతం పూర్తి చేశారు.
ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు
పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల వివరాలు, ఆధార్ కార్డులోని వివరాలు ఒకేలా ఉంటేనే ‘అపార్’ నంబర్ వస్తుంది. లేదంటే వెబ్‌సైట్‌లో సమోదు కావడం లేదు. పేరు పూర్తిగా లేకపోవడం.. పుట్టిన తేదీల్లో తేడా ఉండడంతో ఆధార్‌లో వివరాలను సరిచేసుకునేందుకు విద్యార్థులు మీసేవా కేంద్రాల బాటపడుతున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే అక్కడ సరిచేస్తున్నారు. దీంతో రద్దీ పెరిగి పడికాపులు తప్పడంలేదు.
తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి..
‘అపార్’ కార్డుకు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమ తి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని ధ్రువీకరణ పత్రాలను డిజిటల్ లాకర్‌లో భద్రపర్చుకోవచ్చు. పాఠశాల మారినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వివిధ విద్యాసంస్థల్లో చేరికలు, మార్పులు, ఉద్యోగ సమయంలోనూ ‘అపార్’ ఐడీ ఆధారంగా సమాచారం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితో వివరాలు నమోదు చేస్తున్నారు.
నమోదు
వేగవంతానికి చర్యలు
ఆధార్ కార్డుల్లో విద్యార్థుల వివరాలు సక్రమంగా లేకపోవడంతో వాటిని సరిచేసుకునేందుకే అధిక సమయం పడుతోంది. దీంతో ‘అపార్’ వివరాల నమో దు ప్రక్రియ ఆలస్యం అవుతున్నది. జిల్లా వ్యాప్తంగా నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
– రమేశ్, డీఈఓ
మండలాల వారీగా విద్యార్థుల నమోదు ఇలా..
మండలం పాఠశాలలు విద్యార్థులు పెండింగ్ శాతం
బచ్చన్నపేట 52 4,971 2,009 59.59
చిల్పూర్ 42 2,866 893 68.84
దేవరుప్పుల 60 4,553 1,424 68.72
స్టేషన్‌ఘన్‌పూర్ 58 10,665 3,986 62.63
జనగామ 111 24,924 9,724 60.99
కొడకండ్ల 41 3,569 1,191 66.63
లింగాలఘణపురం 38 3,448 1,017 70.50
నర్మెట 40 3,827 1,128 70.53
పాలకుర్తి 81 7,795 3,109 60.12
రఘునాథపల్లి 69 4,630 1,486 67.90
తరిగొప్పుల 24 1,192 424 64.43
జఫర్‌గఢ్ 42 3,823 1,516 60.35
మొత్తం 658 76,263 27,907 63.41
జిల్లాలో నమోదు 63.41 శాతమే..
ఆధార్ కార్డుల్లో తప్పులతో అడ్డంకులు
పేర్లు, పుట్టిన తేదీల్లో తేడాలు
మార్పు చేర్పుల కారణంగా
నమోదులో తీవ్ర జాప్యం
మొత్తం 76,263 మంది విద్యార్థులు
48,356 మంది వివరాల నమోదు
‘అపార్’ ఆలస్యం
Comments
Please login to add a commentAdd a comment