విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారిగా నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ములుగు జిల్లా ప్రారంభమయ్యే తొలి గ్రామం మహ్మద్‌గౌస్‌పల్లి నుంచి విజయోత్సవ ర్యాలీ మొదలైంది. ఇక్కడ కార్యకర్తలు మంత్రిని గజమాలతో సన్మానించారు. ర్యాలీ మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, జవహర్‌నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, పస్రా మీదుగా మేడారం వరకు కొనసాగింది.
మహ్మద్‌గౌస్‌పల్లిలో గజమాలతో స్వాగతం
గట్టమ్మకు చీర సారె..
గట్టమ్మ ఆలయం వద్ద మంత్రికి మహిళలు కోలాటాలు, బంజార, ఆదివాసీ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె గట్టమ్మ తల్లికి చీరసారె, పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి ప్రచార రథంలో ములుగు వరకు ర్యాలీగా వచ్చారు.
మంత్రి పర్యటనకు ఎస్పీ గాష్‌ఆలం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కూచన రవళిరెడ్డి, కిసాన్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బానోత్ రవిచందర్, వంగ రవియాదవ్‌తోపాటు అధికార ప్రతినిధి అహ్మద్‌పాషా, సీనియర్ నాయకుడు బాధం ప్రవీణ్ కుమార్, ఒజ్జల కుమార్, ఇమ్మడి రాజుయాదవ్, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, రేవంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలే నా కుటుంబ సభ్యులు..
ర్యాలీ సందర్భంగా మల్లంపల్లి, ములుగులో సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గం నా ఇల్లు.. ప్రజలే నా కుటుంబ సభ్యులు.. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా ఉండలేదని, అధికారం ఉందనే భావనను మరిచి ప్రజల మధ్యలో ఉండి వారికి సేవ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నా ములుగు ఆడబిడ్డగా, ఆత్మీయ సోదరిగానే ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకుసాగుతానన్నారు.
సమ్మక్కకు మొక్కుతున్న మంత్రి సీతక్క
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని పార్టీ ప్రజా ప్రతినిధులను కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ, ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు సీతక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమక్క–సారలమ్మలను దర్శించుకున్న తర్వాత ఐటీడీఏ అతిథి గృహంలో మేడారం జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి: పాలనలో మార్పు చూపిస్తాం! : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment