అందని బోనస్
చెల్లింపుల్లో జాప్యం..ఆందోళనలో అన్నదాతలు
● యాసంగి పెట్టుబడులకు అప్పులు చేస్తున్న వైనం
● రైతులకు అందని రూ.24.45 కోట్లు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు భూపాలపల్లి మండలం గుర్రంపేటకు చెందిన ముక్కెర రమేశ్. నెలరోజుల క్రితం 40 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. క్వింటాకు రూ.2,320 చొప్పున రూ.92,800 బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు ఇప్పటి వరకు జమ కాలేదు. ప్రభుత్వం నుంచి బోనస్ డబ్బులు త్వరగా వస్తాయని కొనుగోలు కేంద్రంలో అమ్మానని, పండించిన పంటకు చేసిన అప్పులు కట్టలేక, మళ్లీ యాసంగి సీజన్‌కు పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయాడు. ఇలా చాలా మంది రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.
భూపాలపల్లి రూరల్: మద్దతు ధరతో కలిపి ఇస్తామని బోనస్ రూ.500 ధాన్యం విక్రయించి నెల రోజులు దాటినా ఇంకా కొంతమంది రైతుల ఖాతాల్లో జమకాలేదు. దీంతో యాసంగి పెట్టుబడి కోసం అప్పులు తేవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1.50 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సన్న రకాలకు రూ.2,320 మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. జిల్లాలో కొనుగోళ్లు పూర్తిగా 81,774 మెట్రిక్ టన్నులు ఽసన్నధాన్యాన్ని సేకరించారు. మొత్తానికి గాను బోనస్‌గా రూ.40.89 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.16.44 కోట్లు చెల్లించారు. రూ. 24.45 కోట్ల మేర రైతులకు చెల్లించాల్సి ఉంది. కొన్ని రోజులుగా అన్నదాతలు బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు.
బడ్జెట్ లేకపోవడమే కారణమా?
సన్నరకాలు విక్రయించిన రైతుల వివరాలను ధా న్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రొక్యూర్‌మెంట్, మేనేజ్‌మెంట్ సిస్టంలో నమోదు చేసి, పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ అధికారి లాగిన్‌కు పంపిస్తున్నారు. అనంతరం వాటి ఆధారంగా రైతుల బ్యాంకు ఖాతాలకు సంబంధిత శాఖ బోనస్ జమచేస్తోంది. అయితే ధాన్యం విక్రయించిన వారం రోజుల వ్యవధిలో క్వింటాకు రూ.2,320 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. బోనస్ డబ్బుల జమలో జాప్యం జరుగుతోంది. ఇందుకు సివిల్ సప్లయీస్ శాఖకు లేటుగా రిపోర్టు అందడం.. బోనస్ చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖలో బడ్జెట్ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.
ధాన్యం కొనుగోలు వివరాలు
అందని బోనస్
అందని బోనస్
Comments
Please login to add a commentAdd a comment