మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తిశ్వరస్వామి ఆలయానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి సైకత లింగాలతో మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామివార్లకు గోదావరి జలాలతో అభిషేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడంతో పుర వీధులన్ని భక్తజనంతో నిండిపోయాయి. బుధవారం రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అర్ధరాత్రి లింగోద్భవ పూజకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. భక్తులు జాగరణతో పాటు ఉపవాసదీక్షలను నియమ నిష్టలతో పాటించారు. ఆలయం ఆవరణలో రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేసవి దృష్టిలో పెట్టుకొని భక్తులకు దాతల సాయంతో మినరల్ వాటర్, మజ్జిగ, పండ్లు అందజేశారు.
పోలీసుల బందోబస్తు
ఎస్పీ కిరణ్‌ఖరే, కాటారం డీఎస్పీ రా మ్మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో కాళేశ్వరంలో భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఫిషరీస్, వైద్యారోగ్యశాఖ, ఎన్పీడీసీఎల్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో భక్తులకు సేవలందించారు. పలు రాష్ట్రాల నుంచి సుమారుగా లక్షన్నరకుపైగా మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రముఖుల పూజలు
జిల్లా జడ్జి అఖిల, కలెక్టర్ రాహుల్‌శర్మ దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావు, రామ్మోహన్‌రెడ్డి దంపతులు స్వామి వారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment