విమానం ఎగురుడే..! | - | Sakshi
Sakshi News home page

విమానం ఎగురుడే..!

Published Sat, Mar 1 2025 8:17 AM | Last Updated on Sat, Mar 1 2025 8:13 AM

విమానం ఎగురుడే..!

విమానం ఎగురుడే..!

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం పచ్చజెండా

హెచ్‌ఐఎల్‌ ఇచ్చిన ఎన్‌ఓసీకి ఆమోదం

రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరిస్తే

ముందుకే..

253 ఎకరాలు ఏఏఐకి అప్పగిస్తే

పనులు షురూ

సాక్షి, వరంగల్‌:

రంగల్‌ నగరవాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న విమాన ప్రయాణం కొద్ది నెలల్లోనే సాకారం కానుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో 2038 సంవత్సరం వరకు మరో వాణిజ్య విమానాశ్రయం ఉండద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఐఎల్‌)కు ఒప్పందం ఉన్నా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరపడంతో నిరంభ్యంతరపత్రం (ఎన్‌ఓసీ) ఇచ్చింది. దీనికి కేంద్రం కూడా అంగీకారం తెలిపింది. ముఖ్యంగా మామునూరు విమానాశ్రయ నిర్మాణం కోసం 253 ఎకరాల అదనపు భూమిని సేకరించి ఇస్తే ఏఏఐ టెండర్లు పిలిచి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశముంది. ఇప్పటికే ఈ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ దిశగా వరంగల్‌ రెవెన్యూ అధికారులు కూడా భూసర్వే చేసి పూర్తి వివరాలను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదకు ఇచ్చారు. భూ నిర్వాసితులకు భూమికి బదులు భూమి, కాదనుకునేవారికి నష్టపరిహారం ఇవ్వనున్నారు. మరోమారు గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి , మామునూరు రైతులతో చర్చలు జరిపి సాధ్యమైనంత తొందరగా ఈ భూమి ఏఏఐకి అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ తొలి దశను డిసెంబర్‌లోగా పూర్తి చేసి దేశీయ విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కృతనిశ్చయంతో ఉండడంతో మామునూరులో విమానాలు ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది. భూసేకరణ పూర్తయితే 150 నుంచి 186 మంది ప్రయాణించేలా వీలున్న 37.6 మీటర్లు (123 ఫీట్ల) పొడవున్న ఏ 320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి.

2022లో ‘ఉడాన్‌’కు ఎంపిక

చిన్న నగరాలను రాష్ట్ర, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం 2016లో ఉడాన్‌ (ఉడో దేశ్‌ కీ ఆమ్‌ నాగరిక్‌) పథకం తీసుకొచ్చింది. దీని కింద మామునూరు విమానాశ్రయాన్ని 2022 సెప్టెంబర్‌లో ఎంపిక చేసింది. వరంగల్‌ శివారులోని మామూనూరులో నిజాం కాలంలో ఎయిర్‌స్ట్రిప్‌ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్‌ వే, గ్లైడర్స్‌ దిగేందుకు మరో చిన్న రన్‌ వే ఉంది. దశాబ్దాలుగా వినియోగం లేకపోవడంతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత ఎయిర్‌స్ట్రిప్‌కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆధీనంలో ఉంది. ఈ రన్‌ వే విస్తరణ కోసం అదనంగా అవసరమయ్యే 253 ఎకరాల భూసేకరణ జరగాలంటే ప్రజాప్రతినిధులతోపాటు రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలి.

పర్యాటకం, ఐటీ, పరిశ్రమలకు బూస్ట్‌..

వరంగల్‌ మామునూరు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభమైతే పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ రంగాలు అభివృద్ధి చెందనున్నాయి. సమీపంలోని పర్యాటక ప్రాంతాలైన భద్రాచలం, రామప్ప, లక్నవరం, మేడారానికి మరింతగా సందర్శకులు పెరుగుతారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టైర్‌ 2 పట్టణాల్లోనూ ఐటీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎయిర్‌పోర్ట్‌ కీలకంగా మారనుంది. అలాగే, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులోని కై టెక్స్‌ మాదిరిగానే మరిన్ని అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ముందుకు వస్తే పెట్టుబడులు పెరిగి ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశముంది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశముంది.

కొచ్చిన్‌ ఎయిర్‌పోర్ట్‌ తరహాలో..

కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధ్యయనం చేసి అక్కడి మాదిరిగా ఇక్కడ వసతులు కల్పించేలా చూడాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అక్కడి ప్రత్యేకత ఏమిటో అనే చర్చ వచ్చింది. ‘కొచ్చిన్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ (సీఐఏఎల్‌) పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో నెడుంబస్సెరీ ప్రాంతంలో 1213 ఎకరాల్లో నిర్మించారు. 1999 మే 25న అందుబాటులోకి వచ్చింది. ఏ ప్రాంతం నుంచైనా చేరుకునేలా 56 రేడియల్‌ రోడ్లను నిర్మించారు. సమీప పర్యాటక ప్రాంతాలైన పథనంతిట్ట, ఎర్నాకులం, కొట్టాయం, అలిప్పి నుంచి నేరుగా చేరుకులా ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారులను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్మించిన తొలి ఎయిర్‌పోర్ట్‌ ఇది. 32 దేశాలకు చెందిన 10 వేల మంది ఎన్‌ఆర్‌ఐలు ఈ విమానాశ్రయ నిర్మాణానికి నిధులు ఇచ్చారు. కొచ్చిన్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రస్తుతం 31 అంతర్జాతీయ, 22 దేశీయ గమ్యస్థానాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పూర్తిగా సోలార్‌ విద్యుత్‌తో నడిచే విమానాశ్రయాల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది. తొలుత దేశీయ విమానాల రాకకు టెర్మినల్స్‌ను నిర్మించారు. అనంతరం దశల వారీగా విస్తరణ చేశారు. ప్రస్తుతం మూడు టెర్మినళ్లు ఉన్నాయి. ఒకటి దేశీయ, రెండోది అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సేవలు అందిస్తోంది. మరో దానిలో కార్గో సేవలను నిర్వహిస్తున్నారు. 2023–2024లో 1.08 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల రాకపోకల పరంగా దేశంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది’ అని పౌర విమానాయన శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement