ఫోన్‌పేతో బురిడీ..
కాటారం: డిజిటల్ లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు నిత్యం అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కడో ఒక్కచోట కొందరు ప్రజలను, వ్యాపారులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా శుక్రవారం ఓ దుకాణం యజమానిని మోసంచేసి చివరకు దుండగుడు దొరికిపోయారు. బాధిత దుకాణం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలకేంద్రంలోని గారెపల్లిలో ముస్కమల్ల సత్యం ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఓ యువకుడు దుకాణానికి వచ్చి పలు రకాల సామగ్రి కొనుగోలు చేశాడు. అనుమానం రాకుండా సామగ్రికి సంబంధించిన ధరపై దుకాణం యజమానితో బేరాలు సైతం చేశాడు. సదరు వ్యక్తి కొనుగోలు చేసిన సామగ్రికి సంబంధించి రూ.4వేలు అయింది. ఫోన్ పే చేస్తానని చెప్పడంతో దుకాణం యజమాని సత్యం స్కానర్ చూపించాడు. ఫేక్ ఫోన్ పే ద్వారా రూ.4వేలు చెల్లించిన దుండగుడు పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపించి వెళ్లిపోయాడు. కొంత సమయం వరకు కూడా డబ్బులు జమకాకపోవడంతో అనుమానం వచ్చిన దుకాణం యజమాని అకౌంట్ చెక్ చేసుకోగా డబ్బుల చెల్లింపు జరగలేదు. అప్రమత్తమైన యజమాని దుండగుడిని వెంబడించాడు. చివరకు భూపాలపల్లిలో పట్టుకొని ప్రశ్నించగా ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా చెల్లింపు చేసినట్లు ఒప్పుకున్నాడు. దుండగుడిది గొల్లబుద్ధారం సమీపం నర్సింగపురం అని తెలిసింది. మోసానికి పాల్పడిన యువకుడిని పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు దుకాణం యజమాని సత్యం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment