ఇబ్బందులు లేకుండా ‘రంజాన్’ ఏర్పాట్లు
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. నేటి(ఆదివారం) నుంచి ప్రారంభమైన రంజాన్ మాసం ఏర్పాట్లుపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలన్నారు. ప్రత్యేక ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్ మండలాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రార్థనా మందిరాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఉండాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా రంజాన్ పండుగను ప్రజలందరూ జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శైలజ, డీఎస్పీ సంపత్‌రావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మల్చూర్‌నాయక్, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
యూడీఐడీపై అవగాహన కల్పించాలి..
దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంపై అవగాహన కల్పించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ సూచించారు. శనివారం యూడీఐడీ, సోలార్ విద్యుత్ ఏర్పాటుకు మహిళా సంఘాలు డీపీఆర్ అందజేసే అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మ జిల్లా అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారులు యూడీఐడీ పోర్టల్ ద్వారా స్లాట్‌బుక్ చేసుకునేందుకు మీసేవా కేంద్రాల నిర్వాహకులు, డీఆర్‌డీఏ, సంక్షేమ శాఖల సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్ క్యాంప్‌లో దివ్యాంగులకు సర్టిఫికెట్ జారీ చేయుటకు కావాల్సిన సామగ్రి, టెక్నీషియన్స్, వైద్యుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఆర్‌డీఓ నరేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment