ట్రెజరీలో పైసా వసూల్..?
● ప్రైవేట్ వ్యక్తి ఫోన్‌కు డిజిటల్ చెల్లింపు
కాళేశ్వరం: భూపాలపల్లి, కాటారం సబ్‌డివిజన్‌లో ప్రభుత్వ ఉద్యోగులు డీడీఓల ద్వారా ప్రతి నెల ట్రెజరీకి వేతన బిల్లులు సమర్పిస్తున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో ఐటీ రిటర్న్‌లు, పన్ను మినహాయింపు బిల్లులు వేతన బిల్లులతో జత చేయాల్సి ఉంది. దీంతో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం అక్రమమార్గంలో బిల్లులు చెల్లించడంతో వాటిని అదునుగా తీసుకున్న ట్రెజరీశాఖ ఉద్యోగులు పైసా వసూల్‌కు తెరలేపారని సమాచారం. కాటారం, భూపాలపల్లిలో ట్రెజరీ ఉద్యోగులు అందినకాడికి తప్పులు ఎత్తిచూపి డబ్బులు లాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మొత్తం 28 ప్రభుత్వ పాఠశాలల్లోని స్కూల్‌కాంప్లెక్సులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు నాలుగువేల మంది వరకు ఉన్నారు. ఇందులో ప్రతీ స్కూల్ కాంప్లెక్సుకు రూ.20వేల నుంచి 30వేల వరకు ఐటీ రిటర్న్‌లు, పన్ను మినహాయింపుల కోసం డబ్బులు చేతులు మారాయని తెలిసింది. వీరిపైన ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంతో భూపాలపల్లి, కాటారం డివిజన్‌లలో పైసావసూల్ అంతా నగదు రూపంలో కాకుండా డిజిటల్ చెల్లింపుల ద్వారా యథేచ్ఛగా సాగినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల తప్పులు కూడా ఉండడంతో ట్రెజరీ ఉద్యోగులపై ఫిర్యాదు చేయడానికి జంకుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహరంతో ట్రెజరీ శాఖ ఉద్యోగులు పదిరోజుల్లో రూ.లక్షల్లో అక్రమమార్గంలో సంపాదించారని కోడై కూస్తుంది. డిజిటల్ చెల్లింపులకు ఓ ప్రైవేట్ వ్యక్తిని కూడా ఏర్పాటు చేసుకొని వారి ఫోన్‌కు డబ్బులు పంపితేనే ఫైల్ కదులుతుందని ఓ ప్రభుత్వ ఉద్యోగి వాపోయారు. వీరిపై అధికారులు అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు బాధిత ఉద్యోగులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment