రైస్‌ మిల్లులకే..! | - | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లులకే..!

Published Mon, Mar 3 2025 1:31 AM | Last Updated on Mon, Mar 3 2025 1:26 AM

రైస్‌

రైస్‌ మిల్లులకే..!

భూపాలపల్లి: పేదల బియ్యం పక్కదారి పడుతుంది. రాష్ట్రంలో దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని కొందరు దళారులు రెండు నెలల క్రితం వరకు మహారాష్ట్రకు అక్రమంగా తరలించగా.. ఇప్పుడు ఏకంగా జిల్లాలోని రైస్‌మిల్లులకే పంపిస్తున్నారు. మిల్లర్లు అవే బియ్యాన్ని బస్తాలు మార్చి సీఎంఆర్‌ కింద సివిల్‌ సప్లై గోదాంలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దళారులకు ఒకరిద్దరు సివిల్‌ సప్లయీస్‌ అధికారులు అండగా నిలుస్తుండటంతో ఈ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.

కేజీకి రూ.10నుంచి రూ.12కు కొనుగోలు..

జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 1,23,659 తెల్ల రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతీ నెల ఒక్కో వ్యక్తికి ఆరు కేజీల చొప్పున రేషన్‌ డీలర్ల ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తుంది. కొందరు దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మండలానికో దళారి ఉండగా, వారు బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. కూలీలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్‌ బియ్యం తీసుకునే కుటుంబాల నుంచి బియ్యాన్ని కేజీకి రూ.10 నుంచి రూ.12 చొప్పున కొనుగోలు చేసి కమిషన్‌ పద్ధతిన దళారికి విక్రయిస్తున్నారు. అంతేకాక దళారులు నేరుగా రేషన్‌ డీలర్లతో డీల్‌ కుదుర్చుకొని కేజీకి రూ.10 చొప్పున భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం వరకు ఈ దళారులు రేషన్‌ బియ్యాన్ని మహారాష్ట్రలోని ఓ రైస్‌మిల్లుకు తరలించగా, అక్కడ ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో ఇప్పుడు జిల్లాలోని రైస్‌మిల్లులకే తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఓ మిల్లులో భారీగా పట్టివేత...

రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం మేరకు జిల్లా సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జనవరి 6న రేగొండ మండలం బాగిర్ధిపేట గ్రామంలోని దుర్గా భవాని రైస్‌మిల్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 453 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని గుర్తించి సీజ్‌ చేశారు. ఈ ఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నప్పటికీ దందా మాత్రం ఆగడం లేదు. పలువురు రైస్‌ మిల్లర్లు అదే పనిగా రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ రీ సైక్లింగ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు జిల్లావ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

సమాచారం లేదు..

పీడీఎస్‌ బియ్యం మిల్లులకు తరలిస్తున్నట్లు ఇప్పటి వరకు ఫిర్యాదులు ఏమీ రాలేదు. మాకు సమాచారం కూడా లేదు. జిల్లాలోని రైస్‌ మిల్లులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తాం.

– శ్రీనాథ్‌, డీసీఎస్‌ఓ

అర్ధరాత్రి మిల్లులకు రవాణా..

కూలీలు సేకరించిన, రేషన్‌ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన పీడీఎస్‌ బియ్యాన్ని దళారుల నుంచి జిల్లాలోని కొందరు రైస్‌ మిల్లర్లు కేజీకి రూ. 26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి, తెల్లవారుజామున టాటా ఏసీ ట్రాలీ, డీసీఎం వ్యాన్‌లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్‌ మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్‌ చేసి తిరిగి సివిల్‌ సప్లై గోడౌన్‌లకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీడీఎస్‌ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్‌ సప్లై శాఖలోని ఒకరిద్దరు అధికారులే ఈ దందాను ముందుండి నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి.

జిల్లాలో పీడీఎస్‌ బియ్యం అక్రమ దందా

రెండు నెలల క్రితం వరకు మహారాష్ట్రకు..

బస్తాలు మార్చి సివిల్‌ సప్లయీస్‌ గోదాంలకు

తరలింపు

సహకరిస్తున్న సివిల్‌ సప్లయీస్‌ అధికారులు..?

No comments yet. Be the first to comment!
Add a comment
రైస్‌ మిల్లులకే..!
1
1/1

రైస్‌ మిల్లులకే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement