కొన్నేళ్లుగా జిల్లాలోని రేషన్ బియ్యాన్ని పలువురు దళారులు మహారాష్ట్రలోని సిరొంచలోని ఓ రైస్‌మిల్లుకు అక్రమంగా తరలించేవారు. అక్కడి రైస్‌మిల్ యజమాని రెండు నెలలుగా ఈ దందాను మానుకున్నాడు. దీంతో జిల్లాకు చెందిన ఓ రైస్‌మిల్ యజమాని తెరపైకి వచ్చి రేషన్ బియ్యాన్ని పలు రైస్‌మిల్లులకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గతంలో పని చేసిన దళారులను ఏకం చేశాడు. దందా మానేయాల్సిన అవసరం లేదని, తానే బియ్యాన్ని కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో మండలాల వారీగా ఉన్న దళారులంతా ఏకమై 20రోజుల క్రితం రేగొండలో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అందరం కలిసి సదరు రైస్‌మిల్ యజమాని చెప్పిన మిల్లులకే బియ్యాన్ని సరఫరా చేయాలని, ఒక మండలం వారు మరో మండలంలోకి వచ్చి కొనుగోలు చేయరాదని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారంతా రేషన్‌కార్డుదారులు, రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి సదరు రైస్‌మిల్ యజమాని చెప్పిన రైస్‌మిల్‌కు అర్ధరాత్రి వేళల్లో వివిధ వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment