
రేషన్‌కార్డు దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
భూపాలపల్లి: కొత్త రేషన్ కార్డుల మంజూరు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పులకు మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఐడీఓసీలోని తన చాంబర్‌లో రేషన్ కార్డు దరఖాస్తుల విచారణ, ఆన్‌లైన్ నమోదు తదితర అంశాలపై తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా పాలన, గ్రామసభల్లో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే విచారణ చేసి అర్హత మేరకు మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిశాయని సామాజిక మాద్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. అవి ప్లాస్టిక్ బియ్యం కాదని, పోర్టిఫైడ్ బియ్యమని వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసు కేసులు నమోదు చేయించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.