అమిస్తాపూర్ వద్ద బహిరంగసభ స్థలాన్ని పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు నుంచే ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగసభకు కసరత్తు ప్రారంభించింది. ఈ సభకు స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానుండగా.. ఆ పార్టీ పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో హైకమాండ్ ఉమ్మడి జిల్లాపై ఫోకస్ పెట్టిందని.. దీని వెనుక భారీ ప్రణాళిక ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఈ జిల్లాపై పట్టు సాధించడం ద్వారా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మెజార్టీ సీట్లను సాధించాలనే వ్యూ హాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘పాలమూరు’ నుంచే శ్రీకారం!
ఈ ఏడాది మార్చిలో జరిగిన మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఏవీఎన్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్ర, జాతీయస్థాయి నేతలు ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి.. ఆయన గెలుపు కోసం కృషి చేశారు. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఓడించి.. ఏవీఎన్‌రెడ్డి విజయం సాధించిన క్రమంలో ఆ వ్యూహంపై అధిష్టానం పెద్దలు అప్పుడే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే వ్యూహాన్ని దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబరులో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర అగ్రనేతలతో సభలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది.
ఇందులో భాగంగా ముందుగా అక్టోబర్ 1న ఉదయం నిజామాబాద్ పార్లమెంట్‌తో పాటు మధ్యాహ్నం పాలమూరులో బహిరంగసభల నిర్వహణకు సమాయత్తమైంది. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి ఏర్పాట్లలో తలమునకలయ్యారు. జితేందర్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్ సమీపంలోని మైదానాన్ని పరిశీలించారు.
పీఎల్‌ఆర్‌ఐఎస్ చుట్టేనా?
దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వరప్రదాయిని అయిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్ ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద ఆయన స్విచాన్ చేసి మొదటి మోటార్‌ను ప్రారంభించి కృష్ణా జలాలను అంజనగిరి రిజర్వాయర్‌లోకి వదిలిపెట్టారు.
దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ ఒక్క మోటార్‌తోనే ప్రాజెక్ట్ ప్రారంభించడం వెనుక వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి బీఆర్‌ఎస్ వేసిన జిమ్మిక్కు అనే ప్రచారం మొదలుపెట్టింది. క్షేత్రస్థాయిలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోరు కొనసాగుతున్నట్లు దక్షిణ తెలంగాణలో చర్చ జోరుగా సాగుతోంది.
దీన్ని తిప్పికొట్టడంతో పాటు ఈ ప్రాజెక్ట్‌ను బేస్ చేసుకుని.. అధికార బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. దీని ఆధారంగానే దక్షిణ తెలంగాణలో పట్టు సాధించి, పాగా వేయాలనే సంకల్పంతో పార్టీ పెద్దలు స్కెచ్ వేసినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కృష్ణానదిలో వాటా తేల్చడంలో కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తోందని.. దీని ద్వారా తెలంగాణ, ప్రధానంగా పాలమూరుకు అన్యాయం జరుగుతోందని ఇటీవల సభలో సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
దీనికి కౌంటర్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయహోదా కల్పించాలనే అంశం చేర్చకపోవడం.. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ స్కీంలుగా చెప్పుకుంటోందంటూ అంశాల వారీగా ఇటు బీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించేలా ప్రధాని తదితర ముఖ్య నేతల బహిరంగసభలకు శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఉమ్మడి జిల్లాలో ఐదారు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు..
ప్రధాని సభ వరకు రాష్ట్రంలో 50 నుంచి 60 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించనున్నట్లు వినికిడి. ఇందులో ఉమ్మడి పాలమూరుకు సంబంధించి దాదాపు ఐదారు స్థానాల్లో అభ్యర్థిత్వాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల పర్యటించారు.
మే నెలలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన సభకు హాజరయ్యారు. వచ్చే నెల ఒకటిన నిర్వహించేసభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానుండడం.. ఎం కేసీఆర్ సభ తర్వాత రెండు వారాల వ్యవధిలోనే బీజేపీ సభకు సమాయత్తం కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ రానుండడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో మాత్రం జోష్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment