మహా శివరాత్రికి ఆలయాలు ముస్తాబు
● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
గద్వాలటౌన్: జిల్లాలో అన్ని శైవక్షేత్రాలు బుధవారం రోజు హర హర శంభో శంకర.. ఓం నమః శివాయస్మరణలతో మారుమోగనున్నాయి. ఇప్పటికే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఉపవాసాలకు సిద్ధమయ్యారు. దీంతోపాటు రాత్రంతా జాగరణ చేస్తారు. శివరాత్రి పండగ రోజున ఆలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకం, తదితర పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శివాలయాలతో పాటు గ్రామాలలో ఉన్న శైవక్షేత్రాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెలుగుపేట కాలనీలలోని శివాలయాలతో పాటు వీరభద్రస్వామి, కన్యకాపరమేశ్వరి, నందీశ్వర, భీమలింగేశ్వర ఆలయాలలో తెల్లవారుజాము నుంచే శివునికి రుద్రాభిషేకం, బిల్వపత్ర పూజ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నదిఆగ్రహారంలోని స్పటిక లింగం పూజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. నల్లకుంట కాలనీలోని శివాలయంలో రాత్రి పది గంటలకు లింగోద్భవ అభిషేకం నిర్వహించనున్నారు.
నేడు పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం..
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లకుంట శివాలయం, పాండురంగ శివాలయంతో పాటు పలు శివాలయాలల్లో 26వ తేదీ పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పలుచోట్ల విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలను నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment