చివరి అంకానికి..
సాక్షి, నాగర్‌కర్నూల్/అచ్చంపేట రూరల్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను వెలికితీసేందుకు చేపడుతున్న సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. నేడో, రేపో సొరంగం నుంచి కార్మికులను బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదట గుర్తించిన ఒక స్పాట్ నుంచి నలుగురు, ఆ తర్వాత మరో స్పాట్ నుంచి నలుగురు కార్మికులను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి ఊట పెరుగుతుండటం, మట్టి తొలగింపునకు కన్వేయర్ బెల్టు అందుబాటులోకి రాకపోవడంతో ఆలస్యం అవుతోంది. శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి సంఘటన స్థలానికి చేరుకుని, పనులను పర్యవేక్షించారు.
ఆశలు వదులుకున్నా..
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నిష్ణాతులైన రెస్క్యూ టీంలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. టన్నెల్‌లో పేరుకుపోయిన బురద, నీటి ఊటలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని అధికారులు చెబుతున్నా.. ప్రమాదం జరిగిన సందర్భంలోనే చిక్కుకున్న వారి ప్రాణాలు పోయాయని పలువురు చర్చించుకుంటున్నారు.
కుటుంబీకుల ఎదురుచూపులు..
పొట్టకూటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు, సిబ్బంది ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పనులు చేస్తూ చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎస్‌ఎల్‌బీసీలో జేపీ కంపెనీలో పనులు చేస్తున్నారు. కాగా ఏడు రోజుల నుంచి సొరంగంలో తమ వారు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను చూసి సొరంగంలో చిక్కుకున్న వారి బంధువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. క్షేమంగా బయటపడతారని ఇన్ని రోజులు ఎదురు చూశామని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు భిన్నంగా ఉన్నాయని వాపోతున్నారు. జేపీ కంపెనీ సమీజుపంలోకి పెద్దఎత్తున పార్థివ అంబులెన్సులు రావడంతో తమవారి ప్రాణాలపై ఆశలు లేవని అర్థమైందని అక్కడికి వచ్చిన బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
నీటి ఊట, మట్టి తొలగింపుతో పనులు ఆలస్యం..
మొత్తం 13.85 కి.మీ. సొరంగ మార్గంలో 13.61 పాయింట్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి. మిగతా చోటును గాలించేందుకు అక్కడ సుమారు 18 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, శిథిలాలు ఆటంకంగా మారాయి. జీపీఆర్ గుర్తించిన చోట తవ్వకాలు జరిపేందుకు సింగరేణి, ర్యాట్ మైనింగ్ టీం రంగంలోకి దిగింది. ఎలాంటి మిషనరీ లేకుండా వారు మ్యానువల్‌గా తవ్వకాలు చేపడుతున్నారు. టీబీఎం సంబంధిన విడిభాగాలు, శిథిలాలను కట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సహాయక బృందాల రాకపోకలకు, మట్టి, శిథిలాల తరలింపునకు దారిని ఏర్పాటు చేస్తున్నారు. కట్టర్ చివరి భాగంలో కార్మికులు ఉన్నట్టుగా భావిస్తున్న చోట తవ్వకాలు చేపడుతుండగా, పెద్ద ఎత్తున వస్తున్న నీటి ఊటతో అవరోధాలు ఏర్పడుతున్నాయి. నీటిని తోడేందుకు డీవాటరింగ్, మట్టిని తొలగించేందుకు చేపడుతున్న చర్యలతో ఆలస్యం అవుతోంది.
ఎస్‌ఎల్‌బీసీలో చిక్కుకున్న 8 మంది కార్మికుల అవశేషాల గుర్తింపు
టీబీఎంకు ఇరువైపులా ఉన్నట్లు గుర్తించిన జీపీఆర్ స్కానింగ్
నేడు నలుగురు, 2 రోజుల తర్వాత మరో నలుగురు కార్మికులను వెలికి తీస్తారని అంచనా
సహాయక చర్యలను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి,సీఎస్ శాంతికుమారి
చివరి అంకానికి..
Comments
Please login to add a commentAdd a comment