
లక్ష్యం మేరకు ఉపాధి పనులు చేపట్టాలి
ఇటిక్యాల: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పారదర్శకంగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో జరుగుతున్న వివిధ పనులను ఆయన పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపుదల కోసం రూ.30 వేలతో నిర్మించిన ఇంకుడు గుంత పనులను పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులతో చర్చించారు. అనంతరం మహిళా సమైఖ్య సంఘం కార్యాలయాన్ని సందర్శించి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలను సరైన కొలతలు ప్రకారం కుట్టించి ఆయా పాఠశాలలకు అందజేయాలని సూచించారు. ఆయా గ్రామాల వారీగా రిజిస్టర్లు ఏర్పాటుచేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భద్రప్ప, ఏపీఎం కురుమయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సరైన సమయంలో
ఆస్పత్రికి తరలించాలి
గద్వాల క్రైం/అలంపూర్: అంబులెన్స్ డ్రైవర్లు క్షత్రగాతులను సరైన సమయంలో ఆస్పత్రికి తరలించాలని రాష్ట్ర ఫ్లీడ్ హెడ్ గిరిబాబు అన్నారు. శుక్రవారం జిల్లా ఆస్పత్రితోపాటు అలంపూర్‌లోని 108, 102, పార్థీవ వాహనాలను ఆయనతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్, జిల్లా కో ఆర్డినేటర్ రత్నయ్య తనిఖీ చేశారు. అనంతరం ఆయన డ్రైవర్లతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైన ప్రమాదాలు చోటు చేసుకున్న క్రమంలో సిబ్బంది, వాహన డ్రైవర్లు వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోవాలని, బాధితులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల కోసం సమీప ఆస్పత్రులకు తరలించాలన్నారు. వాహనాల నిర్వహణ ఎప్పటిప్పుడు చూసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలను అందించాలన్నారు. అనంతరం పలు రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో రవికుమార్, రత్నమయ్య తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,021
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శుక్రవారం 308 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6021, కనిష్టం రూ.3076, సరాసరి రూ. 4739 ధరలు పలికాయి. అలాగే, 10 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 6329 ధర వచ్చింది. 112 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5921, కనిష్టం రూ. 5455, సరాసరి రూ. 5921 ధరలు పలికాయి. 1680 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2001, కనిష్టం రూ. 1702, సరాసరి రూ.1910 ధరలు లభించాయి.

లక్ష్యం మేరకు ఉపాధి పనులు చేపట్టాలి