
వినోదం.. కారాదు విషాదం
వేసవి సెలవుల వేళ చెరువులు, బావుల వద్దకు పిల్లల పరుగులు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఈతకు వెళ్లనివ్వొద్దు
● పెద్దలు, శిక్షకుల సమక్షంలోనే ఈత నేర్చుకోవాలి
● గాలి ట్యూబులు, ఇతర రక్షణ కవచాలను నడుముకు, హ్యాండ్ ట్యూబులు కట్టుకోవాలి
● నీటి అడుగులో మట్టి, నాణేలు తెచ్చే, ఎక్కువ సేపు నీటిలో మునిగి ఉంటారనే ఆటలు ఆడొద్దు
● నదులు, కాల్వలు, ప్రాజెక్టుల వద్ద తవ్విన గుంతల్లో ఈత కొట్టొద్దు
● హృద్రోగులు, మూర్చ, హైబీపీ ఉన్న వారు నీటిలోకి వెళ్లొద్దు
● నీటిలో ఎవరైనా మునిగిపోతుంటే సమీపంలో ఉన్న పెద్దవారిని పిలవాలి.
● ఈత నేర్చుకునే క్రమంలో ప్రమాదాల బారిన..
● ఏటా పదుల సంఖ్యలో గాలిలో కలుస్తున్న ప్రాణాలు
● తల్లిదండ్రుల అప్రమత్తం.. స్వీయ జాగ్రత్తలే రక్షణ
గద్వాల క్రైం: విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులంతా ఉత్సాహంతో సొంతూళ్లకు పయనమయ్యారు. సెలవుల్లో వారు చేసే వినోదం అంతా ఇంతా కాదు. కానీ, వేసవి తాపం నుంచి ఉపశమనానికి, ఈత నేర్చుకుందామనే ఉత్సాహంతోనో పిల్లలు చెరువులు, బావుల వద్దకు వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. గతేడాది వేసవిలో జిల్లాలో ఈతకు వెళ్లి ఏడుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చెరువులు, బావులు, నీటి గుంతల పరిసర ప్రాంతాల్లో పోలీసుశాఖ నిఘా ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఈత కోసం వెళ్తే తప్పనిసరిగా వారి వెంట వెళ్లాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు..
● 3.22.2024 మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి (14) గ్రామంలోని తోటి స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు.
● 16.03.2024 అయిజ మండలం మూగోనిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి (10) గ్రామ సమీపంలోని బావిలో ఈత కోట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు. బావిలోకి పై నుంచి దూకగా.. నీటిలో ఉన్న కర్ర ముక్క గొంతుకు గుచ్చుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు.
● 20.03.2024 అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి (17) సమీపంలోని బావి ఉండడంతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు.
స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి
ఈత నేర్చుకునే క్రమంలో గతంలో పిల్లలు ప్రమాదాల బారిన పడ్డారు. వీటి నివారణకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వీయ జాగ్రత్తలపై గ్రామాల్లో కళాకారులచే అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ బావులు, రిజర్వాయర్లు, నీటి కుంటల వద్ద పిల్లలను అటు వైపు రాకుండా గ్రామ పోలీసు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. నిరూపయోగంగా ఉన్న బోరు వెల్స్‌ను మూపివేసేలా ఆదేశాలు జారీ చేశాం. తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖ చెప్పే స్వీయ జాగ్రత్తలు పాటించాలి. బావులు, చెరువులు, నీటి కుంటల వద్ద ప్రహరీ గోడలు ఏర్పాటుకు కృషి చేస్తాం. ప్రమాదాల నివారణకు సిబ్బందిని అప్రమత్తం చేశాం.
– శ్రీనివాసరావు, ఎస్పీ

వినోదం.. కారాదు విషాదం