సాక్షి ప్రతినిధి, కాకినాడ: దశాబ్ద కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మౌనం వీడారు. రాజకీయంగా, ఉద్యమపరంగా సంచలనంగా నిలిచే ఈయన రాజకీయ పునరాగమనానికి ముహూర్తం దగ్గర పడిందా అంటే అవుననే అంటున్నారు సన్నిహితులు. 2016 జనవరి 31న తుని రైలు దహనం కేసులో ముద్రగడతో పాటు మరికొందరిపై నమోదైన కేసును రైల్వే కోర్టు ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ నిర్ణయాన్ని భవిష్యత్‌లో ప్రకటిస్తానని ముద్రగడ లేఖ ద్వారా ప్రకటించారు.
ఆ లేఖలో పలు అంశాలు ప్రస్తావించినా భవిష్యత్ రాజకీయ ప్రకటన పైనే అందరి దృష్టీ పడింది. ఆది నుంచీ కాపు ఉద్యమ సారథిగా ముద్రగడకు రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ ఉంది. తాతల కాలం నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఈయన ప్రస్తుత కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ఓటమి చెందారు. తరువాత నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు సంకేతాలు ఇవ్వడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
అన్ని వర్గాలతో బలమైన బంధం
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన సామాజికవర్గ ప్రతినిధిగా ముద్రగడకు పేరుంది. ఆ సామాజికవర్గం కోసం అనేక ఉద్యమాలు చేశారు. బీసీ, ఎస్సీ నేతలతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. గతంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కొన్ని పోస్టులకు కలత చెందిన ఆయన కాపు సామాజిక ఉద్యమానికి దూరంగా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం మహోధృతమైంది. టీడీపీ ప్రభుత్వ పునాదుల్ని కదిలించింది. కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన చంద్రబాబుతో తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొత్తుకు సై అన్న తరుణంలో ముద్రగడ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జనసేనపై రగులుతున్న యువత
తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా జరిగినా రాజకీయాల్లో మాత్రం చర్చకు తెర తీశాయి. జనసేనపై గంపెడాశలు పెట్టుకున్న కాపు సామాజికవర్గం ప్రధానంగా కాపు యువత.. చంద్రబాబుతో దోస్తీ అనేసరికి మండిపడుతోంది. పవన్ నిర్ణయాన్ని తప్పు పడుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటోంది. ఇటువంటి తరుణంలో ముద్రగడ రాజకీయంగా తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమైంది. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో తలపెట్టిన ఉద్యమంలో ముద్రగడ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయిప్పటికీ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల వైపు మళ్లించలేదు.
అభిమానుల ఒత్తిడి:
2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పద్మనాభం.. ఓటమి అనంతరం కాపు ఉద్యమాన్ని కొనసాగించారు. తదనంతర పరిణామాల్లో 2020లో ఆ ఉద్యమం నుంచి దూరంగా జరిగారు. రైలు దహనం కేసు కొట్టివేసిన అనంతరం ఆయనకు అభిమానుల తాకిడి పెరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ముద్రగడ ఏ పార్టీలో చేరుతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పిన ముద్రగడపై సహచరుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ముద్రగడ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ రాజకీయ నేపథ్యం
ముద్రగడ తాత పద్మనాభం మునసబుగా పని చేశారు. తండ్రి వీర రాఘవరావు 1962, 67 ఎన్నికల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పని చేశారు. 1977లో తండ్రి మరణానంతరం పద్మనాభం అదే ప్రత్తిపాడు నుంచి 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి, 1983, 85లో రెండుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పని చేసి, 1988లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, తరువాత మంత్రి అయ్యారు. 1995 ఎన్నికల్లో ముద్రగడ ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓటమి చెంది, 1999లో తిరిగి టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ అయ్యారు. 2009లో వైఎస్ హయాంలో పిఠాపురం, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అన్ని ప్రధాన పార్టీల్లో పని చేసిన రాజకీయ అనుభవం ముద్రగడకు ఉంది. పాత, కొత్త తరం నేతలతో రాజకీయాలు నడిపిన నేపథ్యమూ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment