బరిలో ఐదుగురు
బొర్రా–గంధం మధ్యనే ప్రధాన పోటీ
జేఎన్‌టీయూకేలో ఓట్ల లెక్కింపు
● 9న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది.
ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.
ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
పోటాపోటీగా ప్రచారం
ఈ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి అభ్యర్థులంతా పోటాపోటీగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కలియ తిరుగుతూ ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకోవడంలో చివరి వరకు బిజీగానే ఉన్నారు. ఈ స్థానానికి గురువారం జరిగే పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాకినాడ జిల్లాలో కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో పోలింగ్ సిబ్బంది బుధవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రితో తరలి వెళ్లారు.
రెండు డివిజన్‌ల పరిధిలో 21 మండలాలలో 22 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. పురుష ఓటర్లు 1,970, మహిళా ఓటర్లు 1,448 మంది. మొత్తం 3,418 మంది ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జేఎన్‌టీయూ కాకినాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్‌లో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూకే రీడింగ్ రూమ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో స్ట్రాంగ్ రూమ్ నిర్వహిస్తారు, జేఎన్‌టీయూకేలోని రీడింగ్ హాలులో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎన్నికల రిటరి్నంగ్ అధికారిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, అసిస్టెంట్ రిటరి్నంగ్ అధికారులుగా డీఆర్‌ఓ జె.వెంకట్రావు, టి.సీతారామమూర్తి, వి.విశ్వేశ్వరరావు, వి.మదన్‌మోహన్, ఎం.వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున మొత్తం 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment