రెండు మూడు రోజుల్లో కార్యాచరణ!
రెబల్‌గా రంగంలోకి దిగాలని యోచన
రామచంద్రపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే రాజకీయ సంచలనాలకు రామచంద్రపురం నియోజకవర్గం వేదికగా ఉంటుంది. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నుంచి అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ పేరును ఇటీవల ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని అటు వ్యతిరేకించలేక, ఇటు ఆమోదించలేక.. మూడు పార్టీల్లోని ఆశావహులు కక్కలేక... మింగలేక అన్న చందాన రగిలిపోతున్నారు. దీనికితోడు సుభాష్.. ఇక్కడి నాయకులను ఏమాత్రం ఖాతరు చేయకుండా, రెండు పార్టీల సమావేశం నిర్వహించకుండా.. తనకు నచ్చిన వారితో వెళ్తూ, ఒంటెద్దు పోకడ అనుసరిస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో సుభాష్‌కు రెబల్ రూపంలో సెగ పెట్టేందుకు తెరచాటున ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆవిర్భావం నుంచీ పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా.. ఆర్థిక బలమే ప్రాతిపదికగా అప్పటికప్పుడు తీసుకువచ్చిన సుభాష్‌కు టికెట్టు ఇవ్వడమేమిటని ఆశావహులు లోలోపల రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా నియోజకవర్గ జనసేన, టీడీపీల్లో తెరచాటుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ రెండు పార్టీల్లో టికెట్టు ఆశించి భంగపడిన నేతలందరూ ఒక్కటవుతున్నారు. సుభాష్‌కు మద్దతు ఇవ్వాలా లేక అసమ్మతి జెండా ఎగురవేయాలా అంనే అంశంపై రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు.
చాపచుట్టేసిన సుబ్రహ్మణ్యం
శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గత మూడేళ్లుగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. చివరకు అధిష్టానం మొండిచేయి చూపడంతో చాప చుట్టేసి స్వస్థలం కొత్తపేట వెళ్లిపోయారు. దీంతో పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని టీడీపీ కార్యాలయం ఇప్పుడు వెలవెలబోతోంది. సుభాష్ పేరు ప్రకటించినప్పటి నుంచీ సుబ్రహ్మణ్యం నియోజకవర్గంలో కనిపించటం లేదు.
కాకినాడలో రహస్య సమావేశం
సీనియర్ నేతలను కాదని, పార్టీకి సంబంధం లేనివారితో సుభాష్ ముందుకు సాగుతున్న తీరును వారు విమర్శిస్తున్నారు. దీనిపై అమీతుమీ తేల్చుకునేందుకు రెండు రోజుల క్రితం కాకినాడలోని ఒక హోటల్‌లో టీడీపీ, జనసేనలకు చెందిన ఆశావహులతో పాటు నియోజకవర్గానికి చెందిన ఆయా పార్టీల సానుభూతిపరులు, ఒక సామాజికవర్గానికి చెందిన బడా నేతలు రహస్య సుదీర్ఘ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసి రంగంలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, ఎవరి మెడలో గంట కట్టాలనే విషయమై ఒక నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన ఆర్థికంగా బలంగా ఉన్న ఒక కాపు సామాజికవర్గ నేత ఒకరు రెబల్‌గా రంగంలోకి దిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని అంటున్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయానికి రావాలని వారు తీర్మానించుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై వారు కె.గంగవరం మండలం కోటిపల్లిలో సోమవారం రెండోసారి సమావేశం కానున్నట్లు తెలిసింది.
నియోజకవర్గంలో ఇప్పటి వరకూ పార్టీ కోసం పని చేసిన వారిని కాదని బయటి నుంచి సుభాష్‌ను తీసుకురావడాన్ని ఇటు టీడీపీ, అటు జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయా అధిష్టానాలనకు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు. దీంతో రెబల్‌గా పోటీ చేసి, సత్తా చాటాలని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తద్వారా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి సుభాష్‌కు పొగ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
కంగు తిన్న జనసేన నేతలు
అలాగే, ఆవిర్భావం నుంచీ నియోజకవర్గంలో జనసేనకు పోలిశెట్టి చంద్రశేఖర్ పెద్ద దిక్కుగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కూడా నేటి వరకూ ఆ పార్టీ ఇన్‌చార్జిగా ఉంటూ వచ్చారు. అటువంటి తనకు కూడా ఆ పార్టీ మొండిచేయి చూపించటంతో ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో ఉన్నారు. ఈయనతో పాటు నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం పని చేసిన చిక్కాల దొరబాబు కూడా టికెట్టు ఆశించి భంగపడ్డారు. జనసేన పార్టీ ఆవిర్భావం రోజునే ఉమ్మడి అభ్యర్థిగా సుభాష్‌ను ప్రకటించటంతో జనసేన నేతలు కంగు తిన్నారు. అప్పటి నుంచీ ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ కార్యాలయం కూడా వెలవెలబోతోంది. వీరితో పాటు టీడీపీ నుంచి టికెట్టు ఆశించిన రేవు శ్రీను, కాదా వెంకట రమణ, రాయపురెడ్డి రాజా కూడా అంతర్మధనంలోకి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment