ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించాలి
కాకినాడ క్రైం: అధికార పార్టీ ఆగడాలపై హైకోర్టు పరోక్షంగా చురక వేసింది. అధికార మదంతో పేట్రేగిపోతున్న పచ్చ మూకలకు, వారికి వంత పాడుతున్న అధికారులకు తమ విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేసింది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నికను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. తుని 25వ వార్డు కౌన్సిలర్ కాసే సుమతి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఈ మేరకు హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలివీ.. కౌన్సిల్‌లో ఒక్క సభ్యుడు కూడా లేకపోయినా.. తుని మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నికను టీడీపీ గూండాలు రెండుసార్లు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు ఈ నెల 3న ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ రోజు వైస్ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు వెళ్తున్న చైర్‌పర్సన్‌ను, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో ‘పచ్చ’ మూకలు బరితెగించాయి. కౌన్సిలర్లు, అధికారులకు మాత్రమే అనుమతి ఉండే కౌన్సిల్ హాలులోకి టీడీపీ నాయకులు, ‘పచ్చ’ గూండాలు చొరబడి, ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్నారు. దీంతో ఎన్నిక ఈ నెల 4వ తేదీకి వాయిదా పడినా ఆ రోజు కూడా టీడీపీ మూకలు ఎన్నిక జరగనివ్వలేదు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సర్వశిక్షా అభయాన్ సీఈవో పి.వేణుగోపాలరావు మున్సిపల్ కార్యాలయానికి రాకుండా తహసీల్దార్ కార్యాలయంలోనే ఉండిపోయారు. తద్వారా అధికార టీడీపీకి పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించాలని మూడోసారి నిర్ణయించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో 25వ వార్డు కౌన్సిలర్ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. మూడోసారైనా ఎన్నిక జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి, అధికార పార్టీ నేతల కట్టుబానిసల్లా వ్యవహరించడాన్ని, పోలీసులు సహా ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సిన పలు విభాగాల అధికారుల తీరును కోర్టు ముందుంచారు. వారి ఉద్యోగాన్ని వారు సక్రమంగా నిర్వహించేలా ఆదేశించాలని మాండమస్ రిట్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు ప్రతివాదుల వివరణ కోరింది. వారి కౌంటర్‌ను అనుసరించి ఎన్నిక నిర్వహించే కౌన్సిల్ హాలులో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి, ఫుటేజీని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది. మరోసారి ఎన్నిక వాయిదా పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఎక్కడా ఏకపక్ష ధోరణికి తావివ్వొద్దని పేర్కొంది. ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరిగి తీరాలని స్పష్టం చేసింది. ఎన్నికను ఇప్పటికే రెండుసార్లు అడ్డుకున్న టీడీపీ నేతల తీరును ప్రజలు ఎండగడుగున్నారు. ఈ నేపథ్యంలో వెలువడిన హైకోర్టు ఆదేశాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తుని మున్సిపల్ వైస్ చైర్మన్–2
ఎన్నికపై హైకోర్టు ఆదేశం
అధికార పార్టీ ఆగడాలపై చురక
అధికారుల బాధ్యతలు గుర్తు
చేసిన న్యాయస్థానం
కౌన్సిలర్ సుమతి రిట్‌పై
స్పందించిన కోర్టు
Comments
Please login to add a commentAdd a comment