ఇదేమి కేశవా!
ఏలేరుకు బడ్జెట్‌లో చోటు లేదే
ఏలేరు వరద వచ్చి పంటలు నీట మునిగి పొలాల్లో ఇసుక మేటలు వేసింది. వేరే పంట వేసే అవకాశం లేకుండా పోయింది. కాలువలకు పడిన గండ్లు పూడ్చ లేదు. వరదలో మునిగి నష్టపోయిన ఇళ్లకు పరిహారం ఇవ్వలేదు. ఏలేరు ఆధునీకరణకు గతంలో మా భూమి తీసుకున్నారు. దానికి పరిహారం ఇవ్వలేదు. భూమిని ఇవ్వడం లేదు. పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చాం. అయినా పట్టించుకోవడం లేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశపడ్డాం.
అదీ లేదు. ఇక ఈ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచినట్టే.
– ముప్పిడి శ్రీనివాసరెడ్డి, రైతు,
రాపర్తి, పిఠాపురం
మండలం.
పిఠాపురం రాపర్తి వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఏలేరు (గొర్రికండి)
● బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులు నిల్●
● ఏలేరుకు కన్నీరే మిగిల్చారు
● సుద్దగెడ్డపైనా చిన్నచూపే
● పంపాకు నిధులు లేకపోయె
● ఉప్పాడ కోత ఊసే లేదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజలకు అశనిపాతంగా మారింది. చంద్రబాబు అంకెల గారడీ బడ్జెట్‌లో స్పష్టమైందని వివిధ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్‌లో నీటిపారుదలతో పాటు అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తే జిల్లాకు లబ్ధి చేకూరుతుందని అంతా ఎదురుచూశారు. తీరా బడ్జెట్ లెక్కలు చూస్తే నిరాశ పరిచిందంటున్నారు. జిల్లాలో మెట్ట ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని రైతులు కళ్లలో ఒత్తులు వేసుకుని చూశారు. అందునా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో ఉండటంతో పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు దండిగా ఉంటాయని లెక్కలేసుకున్నారు. పవన్ మాటల్లో తప్ప చేతల్లో కార్యాచరణ కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఏదీ రైతు కళ్లలో ఆనందం?
అధికారంలోకి వచ్చిన వెంటనే ఏలేరు ఆధునీకరణ పూర్తి చేసి 53 వేల ఎకరాల ఆయకట్టు రైతుల కళ్లలో ఆనందాన్ని చూస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తీరా ఏలేరు ఆధునీకరణకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేక చేతులెత్తేశారని రైతులు ఆక్షేపిస్తున్నారు. ఐదు మండలాల పరిధిలో సుమారు 40వేల మంది రైతుల సమస్య పవన్‌కు కనిపించ లేదా అని నిలదీస్తున్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించాలనే ఆలోచన లేకుండా పోయిందా అని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. సుద్దగడ్డపై కూడా చిన్నచూపేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రత్తిపాడు, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, మండలాల పరిధిలో 30 గ్రామాలు, 35 వేల ఎకరాలు ముంపు బారిన పడుతూ ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల మేర నష్టపోతున్న సుద్దగడ్డకు చిల్లిగవ్వ కేటాయించకపోవడాన్ని నిలదీస్తున్నారు. పంపా బ్యారేజీ ఆధునీకరణకు బడ్జెట్‌లో చోటు దక్కక 15వేల ఎకరాల్లో ఆయకట్టు రైతులు నిరాశకు గురయ్యారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో సుబ్బారెడ్డిసాగర్, చంద్రబాబుసాగర్‌లకు కేటాయింపులు లేవు. పవన్ ఉప ముఖ్యమంత్రి కావడంతో మేలు జరుగుతుందనుకుంటే బడ్జెట్‌లో మెట్ట ప్రాంతంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదని రైతులు మండిపడుతున్నారు.
ఉప్పాడ వాసుల డీలా
ఉప్పాడ సముద్ర కోతకు శాశ్వత నివారణపై పవన్ ఇచ్చిన హామీకి బడ్జెట్‌లో చోటు దక్కకపోవడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. చైన్నె జియలాజికల్ సర్వే బృందాన్ని తీసుకువచ్చి పవన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కాకినాడ–తుని తీరం వెంబడి 1978లో నిర్మించిన బీచ్‌రోడ్డు 28 సార్లు సముద్రకోతకు గురైంది. ఈ రోడ్డు కోత నివారించడంతో పాటు తీరం శాశ్వత రక్షణ చూస్తానని పవన్ ఇచ్చిన మాట రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిఫలిస్తుందని ఉప్పాడ వాసులు ఎదురుచూసి డీలా పడ్డారు. జిల్లాలో 1,74,229 మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వాలంటే రూ.174.225 కోట్లు అవసరం. బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగా ఉండటంతో అందరికీ అందడం అనుమానమేనంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని ఊరించిన చంద్రబాబు బడ్జెట్‌లో కేటాయింపులు చేయకపోవడాన్ని మహిళలు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రజా రవాణా పరిధిలో 300 బస్సుల్లో నిత్యం 80వేల మంది ప్రయాణిస్తుంటే సగం మంది మహిళలే.. అంటే 40వేల మంది ప్రయాణిస్తారు. వీరికి ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం లేనట్టేనంటున్నారు. మహిళలకు రూ.1,500లు ఇస్తానన్న చంద్రబాబు.. అరకొరగానే కేటాయింపులు చేయడంతో ఈ పథకం అటకెక్కినట్టే. నిరుద్యోగ భృతి రూ.3,000 అంశంలో దగా చేసినట్టేనంటున్నారు. జిల్లాలో యువత 3.15 లక్షల మంది ఉన్నారు.
పవన్ ఉండి ఉపయోగం ఏమిటి?
విద్యా, వైద్య సామాజిక రంగాలపై దృష్టి లేదు. గత బడ్జెట్ కన్నా 2 శాతం మాత్రమే ఎక్కువ. పెరిగే ధరలతో పోలిస్తే బడ్జెట్‌లో సామాజిక రంగాలకు న్యాయం జరగలేదు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. కౌలు రైతులకు కేటాయింపులు లేవు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు సరిగా లేవు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో నోరు మెదపడం లేదు. జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్ ఉండి ఏం లాభం. పూర్తిగా వ్యవసాయ వ్యతిరేక బడ్జెట్‌లా ఉంది.
– తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాకినాడ
నిరుద్యోగులకు కుచ్చు టోపీ
రాష్ట్ర బడ్జెట్‌లో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. గద్దెనెక్కిన మరుక్షణమే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మాట ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వకుంటే నెలనెలా రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆ మాటలు నమ్మి ఓటేశాం. తీరా పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో చూస్తే నిరుద్యోగ భృతికి చోటు దక్కక పోవడం అన్యాయం. తల్లికి వందనం పథకంలో కేటాయింపులు చూస్తుంటే విద్యార్థుల సంఖ్యకు, కేటాయింపులకు పొంతన లేకుండా ఉంది.
– పెంకే రవితేజ, జిల్లా నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి, కాకినాడ.
తీర ప్రాంతానికి తీరని అన్యాయం
సముద్ర కోతకు గురవుతోన్న ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు నిధులు కేటాయించకపోవడం అన్యాయం. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ నిధుల మాట లేకపోవడం దారణం. నాడు కోతకు గురవుతోన్న ప్రాంతాన్ని పరిశీలించిన సందర్భంలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం బడ్జెట్‌లో నిధులు వస్తాయని ఎదురు చూశాం. అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించకపోవడం నిరాశ కలిగించింది.
– ఉమ్మిడి జాన్, మత్స్యకార నాయకుడు, ఉప్పాడ
ఇదేమి కేశవా!
ఇదేమి కేశవా!
ఇదేమి కేశవా!
ఇదేమి కేశవా!
ఇదేమి కేశవా!
Comments
Please login to add a commentAdd a comment