కమిషనరా.. కార్యకర్తా?
● పాడాకు గెస్ట్‌హౌస్ కేటాయించడంపై కౌన్సిలర్ల ఆందోళన
● కమిషనర్ కనకారావు తీరుకు నిరసనగా చైర్మన్ పోడియం వద్ద బైఠాయింపు
● అనుమతులు రద్దు చేయాలని
కౌన్సిల్‌లో తీర్మానం
పిఠాపురం: కౌన్సిల్ ఆస్తిని కౌన్సిల్‌కు తెలియకుండా వేరే వాళ్లకు ఎలా రాసిచ్చారు? మీరు కమిషనరా పార్టీ కార్యకర్తా అంటూ పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుపై కౌన్సిలర్లు మండిపడ్డారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల మృతిచెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ శీరం శ్రీరామచంద్రమూర్తి మృతికి సంతాపం సూచకంగా కౌన్సిలర్లు మూడు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించగానే వైఎస్సార్ సీపీకి చెందిన 25 మంది కౌన్సిలర్లు మున్సిపల్ అతిథి గృహాన్ని పిఠాపురం డెవలప్‌మెంట్ అథారిటీకి కౌన్సిల్ అనుమతి లేకుండా ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలని కమిషనర్ కనకారావును ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో గెస్ట్‌హౌస్‌ను పాడాకు కేటాయించామని ఆయన తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు కౌన్సిల్ ఆస్తిని కౌన్సిల్‌కు తెలియకుండా వేరే వాళ్లకు ఎలా రాసిచ్చారు? అసలు రాసివ్వడానికి మీరెవరు అంటు నిలదీశారు. అయితే గెస్ట్‌హౌస్ ఖాళీగా ఉండడంతో ప్రభుత్వ కార్యాలయానికే కాబట్టి ఇవ్వాల్సి వచ్చిందంటూ కమిషనర్ సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు కమిషనర్ తీరుపై నిరసనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద బైఠాయించిన కౌన్సిలర్లు పాడాకు కేటాయించిన అనుమతులు రద్దు చేయాలని పట్టుబట్టారు. రద్దు చేస్తూ తీర్మానం చేయాలని ఆ తీర్మానాన్ని ప్రస్తుత సమావేశం ఎజెండాలో పెట్టాలని అప్పటి వరకు తాము ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. కౌన్సిలర్లు ఆందోళన చేస్తున్నా కమిషనర్ ఏమీ పట్టించుకోకుండా వ్యవహరించడంతో మీరు కమిషనర్‌గా కాకుండా కూటమి నేతగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. నా వెనుక ఉప ముఖ్యమంత్రి , జిల్లా కలెక్టర్ ఉన్నారన్న ధీమాతో ప్రజలు ఎన్నుకొన్న కౌన్సిలర్లను లెక్క చేయకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషనర్‌ను దుయ్యబట్టారు. మున్సిపల్ గెస్ట్‌హౌస్‌ను పాడాకు కేటాయించిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్మానం సమావేశంలో ప్రవేశపెట్టాలని కోరుతూ కౌన్సిలర్లు సంతకాలు చేసి చైర్మన్‌కు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే ఈ తీర్మానాన్ని ఎజెండాలో జత చేయగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం సుధీర్ఘంగా మద్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. మున్సిపల్ వైస్ చైర్మన్‌లు పచ్చిమళ్ల్ల జ్యోతి, కొత్తపల్లి పద్మ, పలువురు అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment